Chetak diamond jubilee : రక్షణ రంగంలో సుధీర్ఘకాలంగా సేవలందిస్తున్న చేతక్ హెలీకాప్టర్ వజ్రోత్సవ వేడుకలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. హాకీంపేట్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ ఆధ్వర్యంలో కొనసాగిన కార్యక్రమంలో చేతక్ హెలీకాప్టర్‌తో పాటు పలు రకాల యుద్ద విమానాలు విన్యాసాలు చేశాయి. సుమారు రెండు గంటల పాటు సాగిన విన్యాసాలు వీక్షకులను ఆకట్టుకున్నాయి. గాలిలో గిరికీలు కొడుతూ యుద్ద విమానాలు ఉవ్వెత్తున ఎగిరాయి. విమానాల విన్యాసాలు వీక్షకులను ఆద్యంతం కట్టిపడేశాయి. ఈ కార్యక్రమంలో వైమానికాధికారుల కుటుంబాలు పెద్దఎత్తున పాల్గొన్నాయి. వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ కూడా చూపరులను ఆకర్షించింది.
చరిత్ర ఘనం :పాత తరం హెలికాప్టరే అయినా ఎంతో చరిత్ర చేతక్ సొంతం. బహుళ ప్రయోజనకారిగా కార్గో, ట్రాన్స్‌పోర్ట్, అత్యవసర వైద్యం, సెర్చ్, ఏరియల్ సర్వే, పెట్రోలింగ్, ఆఫ్ షోర్ ఆపరేషన్లలో కీలక పాత్ర పోషించింది. బెంగళూరులోని హిందుస్థాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) దీన్ని ఉత్పత్తి చేస్తోంది. 1965లో మొదటి హెలికాప్టర్‌ను తయారు చేశారు. టర్బో షాఫ్ట్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇప్పటివరకు హెచ్‌ఏఎల్ 350 వరకు హెలికాప్టర్లను మన దేశంతో పాటూ విదేశాలకూ విక్రయించింది.