జీడిమెట్ల నాలాలోనే రోజుకు సుమారుగా 45 ఎంఎల్‌డీల పారిశ్రామిక వ్యర్థజలాలు పారుతున్నట్లు అధికారుల అంచనా. ఈ జలాలు కూకట్‌పల్లి నాలాలో కలుస్తున్నాయి. వరదలకు నాలా పొంగి ప్రవహించింది. పరికిచెరువు నుంచి ఎగసిపడుతోన్న నురగను తోడ్కొని ఆల్విన్ కాలనీ, కూకట్‌పల్లి, ఫతేనగర్ మీదుగా బేగంపేట, హుస్సేన్‌సాగర్‌దాకా చేరుతోంది. పరికిచెరువు పరిసరాల్లోనూ, అల్విన్‌కాలనీలో ఏళ్లుగా రోడ్లపై నురగ పొంగుతున్నా అధికారులకు చీమ కుట్టినట్లు లేకపోవడం గమనార్హం.
ప్లాంట్లకు రాకుండా ఎక్కడికి..?
జీడిమెట్లలోని కొన్ని ఫార్మా, బల్క్‌డ్రగ్ పరిశ్రమల నిర్వాహకుల కాసుల కక్కుర్తి లక్షలాదిమంది పాలిట శాపంగా మారుతోంది. ఉత్పత్తులను తయారుచేసే క్రమంలో వెలువడే ప్రమాదకర ఘన, జల రసాయన వ్యర్థాలను గుట్టుచప్పుడు కాకుండా నాలాలోకి విడిచిపెడుతున్నారు. వాస్తవానికి జీడిమెట్ల రసాయన వ్యర్థ జలాల శుద్ధి(జేఈటీఎల్) కేంద్రం సామర్థ్యం 5ఎమ్‌ఎల్‌డీ. గతంలో 3 ఎమ్‌ఎల్‌డీ వ్యర్థజలాలిక్కడికి వచ్చేవి. ఇప్పుడు ఆ సంఖ్య తగ్గింది. మిగిలిన వ్యర్థాలు ఎక్కడికెళ్తున్నాయంటే.. నాలాల్లోకే అన్న మాట వినిపిస్తోంది.
ముఠాకు రూ.50 వేలు..
రసాయన వ్యర్థాలను శుద్ధి చేసేందుకు నేరుగా కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్(సీఈటీపీ)కి తరలించాలి. ఇందుకు కొంత మొత్తం చెల్లించాలి. లేదా సొంత ఈటీపీ ద్వారా రసాయన పరిశ్రమలే శుద్ధి చేయాలి. ఆ డబ్బు ఆదా చేసుకునేందుకు వ్యర్థాలను నేరుగా నాలాల్లోకి కలిపేస్తున్నారు. కొన్ని పెద్ద సంస్థలు ముఠాల ద్వారా పరికి చెరువు, ఇతర జలవనరుల్లో సెప్టిక్‌ట్యాంకు, వాటర్ ట్యాంకుల్లాంటి వాహనాల ద్వారా వదిలేస్తున్నారు. ఆయా పరిశ్రమలు ఒక్కో ముఠాతో రూ.50వేలకు ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం.
తూతూమంత్రంగా చర్యలు..!
ఫిర్యాదులను పీసీబీ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మామూళ్ల మత్తులో పడి తూతూమంత్రంగా చర్యలు చేపట్టి తర్వాత యథావిధిగా వదిలేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇలాగే వదిలేస్తే తమ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.