తెలంగాణ

telangana

ETV Bharat / city

ఇవి తింటే... ఇక అంతే..! - ఇవి తింటే... ఇక అంతే..!

రసాయనాల కూరలు భయాందోళన కలిగిస్తున్నాయి. కూరగాయలపై హానికర రసాయన అవశేషాలున్నట్లు పరిశోధన సంస్థల సర్వేలో వెల్లడైంది. తెగుళ్లు, చీడపీడల నివారణకు పైరుపై సిఫారసు చేయనివి కూడా రైతులు విచక్షణారహితంగా పిచికారీ చేస్తున్నారు. భాగ్యనగరంలో మార్కెట్‌లో విక్రయిస్తున్న కూరగాయలపై రసాయన అవశేషాలు ఉన్నట్లు జాతీయ మొక్కల ఆరోగ్య నిర్వహణ సంస్థ గుర్తించింది. ఈ మేరకు తాజాగా ఒక నివేదికలో స్పష్టం చేసింది.

ఇవి తింటే... ఇక అంతే..!

By

Published : Jul 30, 2019, 4:36 AM IST

Updated : Jul 30, 2019, 7:31 AM IST

ఇవి తింటే... ఇక అంతే..!

హైదరాబాద్‌లో అమ్ముతున్న పలు రకాల కూరగాయలపై హానికర, నిషేధిత రసాయన అవశేషాలు ఉన్నట్లు తాజాగా జాతీయ మొక్కల ఆరోగ్య నిర్వహణ సంస్థ ప్రయోగాల్లో గుర్తించింది. ఇదేం కొత్త కాకపోయినా నెలకోసారి నగరంతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లోని మార్కెట్లలో ప్రజలకు విక్రయించే కూరగాయల నమూనాలను ఈ సంస్థ ప్రతినిధులు కొని తీసుకెళ్లి ప్రయోగశాలల్లో పరీక్షిస్తున్నారు. గత ఆరు మాసాల్లో ఇచ్చిన నెల వారీ నివేదికల్లో రసాయన అవశేషాలున్న వాటి వివరాలను సంస్థ వెల్లడించింది.

15 నమూనాల్లో అవశేషాలు

గత నెలలో నగరంలో అల్వాల్, మెహిదీపట్నం రైతుబజార్ల నుంచి 20 నమూనాల బెండకాయలు తీసుకెళ్లి శాస్త్రవేత్తలు పరీక్షించారు. ఇందులో 15 నమూనాలపై రసాయన అవశేషాలు ఉన్నట్లు తేలింది. ఎసిటామిట్రిప్‌, ఎసిఫేట్‌, కార్బిండిజమ్, బుప్రోజిన్ రసాయన అవశేషాలు వీటిపై ఉన్నాయి. 4 నమూనాలపై చాలా ఎక్కువ మోతాదులో రసాయన అవశేషాలు ఉన్నాయి. అవి తింటే మనిషి ఆరోగ్యానికి ప్రమాదకరం అని గుర్తించారు. ప్రతి పంటకు తెగులు సోకినప్పుడు నియంత్రణకు ఏ మందు ఎంత మోతాదులో పిచికారీ చేయాలనేది నిర్ణీత ప్రమాణాలు ఉన్నాయి. కానీ, అవి ఏ రైతు పాటించడం లేదు.

రసాయనాల వల్ల అనేక రోగాలు

కొన్ని పంటలకు పిచికారీ చేయడానికి అనుమతి లేని రసాయన మందులు రైతులు విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. ఆ పంటలను తిన్న మనుషుల కడుపులోకి నేరుగా ఈ రసాయనాలు వెళ్లడం వల్ల కడుపు మంట, పేగుకు పుండ్లు, కేన్సర్‌ వంటి అనేక రోగాల పాలవుతున్నారు. కానీ, అల్వాల్ కూరగాయల మార్కెట్‌లో కొనుగోలు చేసిన ఆ బెండకాయలపై ఎసిఫేట్ రసాయన మందు అవశేషాలు ఉన్నట్లు ప్రయోగాల్లో గుర్తించడం గమనార్హం.

విషపూరిత రసాయనాలు పిచికారీ చేస్తున్న రైతులు

కీర దోసకాయలపై మచ్చలుంటే నాణ్యతగా లేవని ప్రజలు తినడానికి మార్కెట్‌లో కొనడం లేదని వ్యాపారులు చెప్పారు. ఇలా వాటిపై మచ్చలు కనిపించకూడదని అత్యంత విషపూరిత రసాయనాలను రైతులు పిచికారీ చేస్తున్నారు. ఈ మందుల వల్ల అవి నిగనిగలాడుతూ కనిపిస్తాయి. కీరదోసపై పిచికారీ చేయడానికి మెటాక్సిల్‌, క్లోరీఫైరీఫాస్, కార్బోప్యూరాన్ అసలు సిఫారసు చేయలేదు. శంషాబాద్, మెహిదీపట్నం మార్కెట్లలో కీరదోస కాయలు కొని ప్రయోగాల్లో పరీక్షిస్తే... వాటిపై ఈ మూడు రసాయనాలు ఉన్నాయి.

నిర్ణీత మోతాదు మించి

ప్రజలంతా ఎక్కువగా వినియోగించే టమాటాలపైనా రసాయనాల అవశేషాలు అధికంగా ఉంటున్నాయి. టమాటాపై బ్యూటాక్లోర్‌ రసాయన మందు చల్లమని శాస్త్రవేత్తలు సిఫారసు చేయలేదు. కానీ, శంషాబాద్‌లో కొన్న టమాటాలపై కిలోకు 0.6 మిల్లీగ్రాముల వరకూ బ్యూటాక్లోర్ ఉంది. రైతులు మందుల ప్యాకెట్లపై ఉండే వివరాలు చదవకపోవడం, పాటించకుండా ఇష్టారీతిగా చల్లుతున్నందున అవశేషాలు ఎక్కువగా ఉంటున్నాయి. దీని వల్ల ఒక రసాయన మందును పురుగులు లేదా తెగులు నియంత్రణకు పిచికారీ చేయడానికి అనుమతి ఉన్నా నిర్ణీత మోతాదు కన్నా ఎక్కువగా చల్లడంవల్ల అవశేషాలు ఎక్కువగా మిగిలి ప్రజల అనారోగ్యాలకు కారణమవుతుంది.

తస్మాత్​ జాగ్రత్త

సాధారణంగా మార్కెట్‌ నుంచి కొనుగోలు చేసి తెచ్చిన కూరగాయలు నేరుగా ఎట్టి పరిస్థితుల్లోనూ తినరాదు, వండుకోరాదు. సాధారణంగా ఒక పైరుపై రసాయన పురుగు మందు పిచికారీ చేసిన తర్వాత 5 నుంచి 7 రోజుల దాకా పంట కోసి మార్కెట్‌కు రైతులు తీసుకురాకూడదని ఉద్యాన శాఖ అధికారులు తెలిపారు. మందులతో పండించిన కొన్ని కూరగాయలను వండే ముందు 15 నిమిషాలు గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసి నాన పెట్టాలి. ఆ తర్వాత నల్ల నీటి కింద శుభ్రంగా రుద్ది కడిగిన అనంతరం కోసి వండుకోవాలని వ్యవసాయాధికారులు సూచించారు.

ఇవీ చూడండి: వర్షంతో చిగురించిన రైతుల ఆశలు

Last Updated : Jul 30, 2019, 7:31 AM IST

ABOUT THE AUTHOR

...view details