తెలంగాణ

telangana

ETV Bharat / city

Obesity: అన్ని జాగ్రత్తలు పాటించినా బరువు పెరుగుతున్నారా.. కారణం ఇదే కావచ్చు..! - ఉబకాయానికి కారణాలు

ఆహారం మితంగానే తీసుకుంటున్నారా? శారీరక వ్యాయామం చేస్తున్నా బరువు తగ్గకపోగా.. ఏడాదికేడాది పెరుగుతున్నారా? అయితే దీనికి ప్రధాన కారణం శరీరంలోని 'యూసీపీ ప్రొటీన్‌' పనితీరు దెబ్బతినడమే! శరీరంలోని ముదురు గోధుమరంగు కొవ్వును కరిగించే గుణమున్న ఈ ప్రొటీన్‌ పనితీరు మందగిస్తే.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ.. నియమాలు పాటిస్తున్నా కూడా ఏడాదికి సుమారు 2.5 కిలోల వరకు బరువు పెరిగే అవకాశముంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

chemical pesticides on food items causes obesity
chemical pesticides on food items causes obesity

By

Published : Sep 5, 2021, 6:57 AM IST

Updated : Sep 5, 2021, 8:08 AM IST

మనం తీసుకునే ఆహారాల్లో పురుగుమందుల వాడకం అధికమవడమే కొవ్వు కరగకపోవడానికి కారణమని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా ‘క్లోరిఫైరిఫాస్‌’ అనే పురుగుమందు చల్లిన ఆహార పంటలను తిన్నవారికి ఊబకాయం వస్తున్నట్లు గుర్తించారు. కెనడాలోని హామిల్టన్‌కు చెందిన 'మెక్‌మాస్టర్‌' విశ్వవిద్యాలయంలోని 'సెంటర్‌ ఫర్‌ మెటబాలిజమ్‌ ఒబేసిటీ అండ్‌ రిసెర్చ్‌' బృందం నిర్వహించిన పరిశోధనలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఇటీవలే ఈ పరిశోధన పత్రం ప్రఖ్యాత వైద్య పత్రిక 'నేచర్‌'లో ప్రచురితమైంది. మన దేశంలోనూ 'క్లోరిఫైరిఫాస్‌' మందును విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు.

విచ్చలవిడిగా పురుగుమందుల వాడకం

20 ఏళ్లతో పోల్చితే ఇప్పుడు అధిక బరువు, ఊబకాయుల సంఖ్య పెరిగింది. ఎందుకీ వ్యత్యాసం అనే కోణంలో శాస్త్రవేత్తలు పరిశోధించగా.. ‘క్లోరిఫైరిఫాస్‌’ అనే పురుగుమందు ఊబకాయానికి కారణమవుతోందని గుర్తించారు. ఈ మందు ప్రజారోగ్యానికి ముప్పు తెస్తుందని కెనడాలో వాడకాన్ని ఎప్పుడో నిషేధించారు. మనదేశంలో దీన్ని ఎక్కువగా వాడుతున్నారు. గతేడాది మనదేశంలో మొత్తం 24,232.62 టన్నుల రసాయన మందులను పంటలపై చల్లగా అందులో క్లోరిఫైరిఫాస్‌ 1,094 టన్నులతో అగ్రస్థానంలో, దీని తరవాత 433 టన్నులతో ప్రెఫినోఫాస్‌ రెండో స్థానంలో ఉందని కేంద్ర మొక్కల పరిరక్షణ మండలి తాజాగా వెల్లడించింది. అంతకుముందు ఏడాది(2019-20) దేశంలో 1,430.62 టన్నుల క్లోరిఫైరిఫాస్‌ను రైతులు పంటలపై చల్లారు. గత అక్టోబరులో హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌ మార్కెట్‌లోని వంకాయలను ప్రయోగశాలలో పరీక్షిస్తే వాటిపై క్లోరిఫైరిఫాస్‌ రసాయన అవశేషాలు ఉన్నాయి. అవి నిర్ణీత ప్రమాణాలకన్నా ఎక్కువగా ఉన్నట్లు జాతీయ మొక్కల ఆరోగ్య నిర్వహణ సంస్థ(ఎన్‌ఐపీహెచ్‌ఎం) కేంద్ర వ్యవసాయశాఖకు పంపిన నివేదికలో తెలిపింది. ఇతర దేశాలు నిషేధించిన వాటిలో అత్యంత విషపూరితమైన 27 రకాల రసాయనాలను మనదేశంలో సైతం పంటలపై వాడకుండా నిషేధించాలని ప్రతిపాదిస్తూ గతేడాది(2020) మేలో కేంద్రం ముసాయిదా విడుదల చేసింది. కానీ వాటి తయారీ కంపెనీల ఒత్తిడితో నిషేధాన్ని ఇంతవరకూ అమల్లోకి తీసుకురాలేదనే ఆరోపణ ఉంది. ఈ జాబితాలోని క్లోరిఫైరిఫాస్‌ను మనదేశంలో, తెలుగు రాష్ట్రాల్లో పంటలపై విచ్చలవిడిగా చల్లుతున్నారు.

దుష్ప్రభావం ఎలా?

ముదురు గోధుమరంగు(బ్రౌన్‌) కొవ్వు కణాల్లో కనిపించే 34 రకాల పురుగుమందు అవశేషాలపై కెనడా శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపారు. మన శరీరంలో కేలరీలను కరిగించే గుణాన్ని బ్రౌన్‌ కొవ్వు కలిగి ఉంటుంది. ఎలుకలకు బాగా కొవ్వు ఉన్న ఆహారాన్ని ఇచ్చి క్లోరిఫైరిఫాస్‌ ప్రయోగించారు. దీనివల్ల బ్రౌన్‌ కొవ్వు కేలరీలను కరిగించే శక్తిని కోల్పోయింది. ఇలాగే మనుషుల్లోనూ జరుగుతోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. పర్యవసానంగా శరీరంలో సాధారణ కొవ్వు పెరిగి ఊబకాయం బారిన పడుతున్నట్లు కెనడా వర్సిటీ శాస్త్రవేత్తలు తేల్చారు.

మన కూరగాయలపై అవశేషాలు

ప్రజలకు విక్రయిస్తున్న కూరగాయలు, పండ్లను నమూనాగా తీసుకుని వాటిపై రసాయన అవశేషాలున్నాయా లేదా అనే పరీక్షలు నిత్యం చేస్తున్నారు. రాజేంద్రనగర్‌లోని ఎన్‌ఐపీహెచ్‌ఎం, ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని అధునాతన ప్రయోగశాలల్లో కేంద్ర వ్యవసాయశాఖ ఈ పరీక్షలు చేయిస్తోంది. ఉదాహరణకు ‘అసిఫేట్‌’ అనే రసాయన మందును వంగతోటలపై చల్లడానికి కేంద్రం అనుమతించలేదు. గుడిమల్కాపూర్‌లో అమ్ముతున్న వంకాయలపై ప్రతి కిలోకు 0.26 మిల్లీగ్రాముల అసిఫేట్‌ ఉన్నట్లు తేలింది. ఇలాగే ‘బైఫెనిత్రిన్‌’, టెబుకోనజోల్‌’ అనే మందులను సైతం కేంద్ర మొక్కల పరిరక్షణ మండలి సిఫార్సు చేయకున్నా.. వంకాయలపై చల్లడంతో వాటి అవశేషాలున్నట్లు ఎన్‌ఐపీహెచ్‌ఎం తెలిపింది.

గోరువెచ్చని ఉప్పునీటిలో కడగాలి

"ఏ పంటనైనా కోసి మార్కెట్‌కు తరలించడానికి వారం ముందు మాత్రమే రసాయనాలు చల్లాలి. కానీ కూరగాయలపై కోసే ముందు రోజు కూడా చల్లుతున్నారు. తాజాగా నవనవలాడుతూ కనపడితేనే ప్రజలు కొంటారనీ, మంచి ధర వస్తుందని ఒకరోజు ముందు కూరగాయలు, పండ్లపై రసాయనాలు చల్లుతున్నారు. దీంతో పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. వీటిని మార్కెట్‌లో ప్రజలు కొన్నప్పుడు గోరువెచ్చని ఉప్పునీళ్లలో శుభ్రంగా కడిగితే రసాయన అవశేషాలు చాలావరకూ పోతాయి. కడగకుండా వండినా, తిన్నా అనేక రోగాలు చుట్టుముట్టే ప్రమాదముంది." --డాక్టర్‌ శ్రీదేవి, ప్రధాన శాస్త్రవేత్త, రసాయన పురుగుమందుల అవశేషాల గుర్తింపు ప్రయోగశాల, జయశంకర్‌ వర్సిటీ

సేంద్రియ ఆహారం మేలు

"ఆహారం మితిమీరి తీసుకోవడం, శారీరక శ్రమ లోపించడం, నిద్రలేమి, జన్యుపర, హార్మోన్ల సమస్యలతో ఊబకాయం వస్తోందని మనం భావిస్తుంటాం. అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌, యూరోపియన్‌ డయాబెటిక్‌ అసోసియేషన్‌ తదితర ప్రఖ్యాత సంస్థలు.. ఊబకాయాన్ని తగ్గించడంలో 78 శాతం వరకు ఆహారమే ప్రధాన మార్గమని స్పష్టం చేస్తున్నాయి. శారీరక శ్రమ అనేది కేవలం 20 శాతం వరకే తోడ్పడుతుందని చెబుతున్నాయి. ఒకవేళ బరువు తగ్గితే మళ్లీ పెరగకుండా ఉండేందుకు శారీరక శ్రమ దోహదం చేస్తుంది. పురుగుమందులు, రసాయనాల వాడకం కేవలం నేరుగా పంటల ఉత్పత్తులపైనే కాదు.. ఆహారశుద్ధి, నిల్వ, ప్యాకింగ్‌ తదితర ప్రక్రియల్లోనూ వేర్వేరు రూపాల్లో వినియోగిస్తున్నారు. వీటి ద్వారా కూడా పురుగుమందులు శరీరంలోకి వెళ్తున్నాయి. దీంతో దీర్ఘకాలంలో ఊబకాయం వస్తోంది. అందుకే సాధ్యమైనంత వరకూ తాజా సేంద్రియ ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం మేలు. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు వంటి వాటిని ఒక బకెట్‌ నీళ్లలో ఒక కప్పు బేకింగ్‌ సోడా లేదా వెనిగర్‌ వేసి, అరగంట నానబెట్టి శుభ్రపరిచి వండుకోవడం మంచిది. దీనివల్ల 90 శాతం వరకూ పురుగుమందులను తొలగించడానికి అవకాశం ఉంటుంది." -డాక్టర్‌ వి.జగదీశ్‌కుమార్‌, సీనియర్‌ కన్సల్టెంట్‌ ఫిజీషియన్‌, ఏఐజీ

చౌకగా వస్తోందని ఎక్కువ వాడకం

"పంటలపై ఏ రసాయన మందును ఎంత మోతాదులో వాడాలనే మార్గదర్శకాలు స్పష్టంగా ఉన్నాయి. చాలావరకు రైతులు వీటిని పట్టించుకోవడం లేదు. ఉదాహరణకు క్లోరిఫైరిఫాస్‌ 50 ఏళ్లుగా పంటలపై చల్లుతున్నారు. ఇతర రసాయనాలకన్నా ఇది మార్కెట్‌లో చౌకధరలకు లభిస్తుండడంతో.. దీన్ని మోతాదుకు మించి వాడుతున్నారు. ముఖ్యంగా కూరగాయలపై అధికంగా ఉపయోగిస్తున్నారు. కాయ తొలుచు పురుగు, దోమలను చంపడానికి ఇది వాడతారు. లీటరు నీటిలో ఈ మందును 2.5 మిల్లీలీటర్లు మాత్రమే కలిపి పంటలపై చల్లాలి. కానీ కొందరు రైతులు లీటరు నీటికి 10 మి.లీ. కూడా కలుపుతున్నారు. కొన్ని రసాయనాలు కడుపులోకి వెళ్తే జీర్ణాశయ క్యాన్సర్‌ కూడా వస్తుంది." --డాక్టర్‌ దుర్గాప్రసాద్‌, వై.సతీష్‌, వ్యవసాయ శాస్త్రవేత్తలు, రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం

Last Updated : Sep 5, 2021, 8:08 AM IST

ABOUT THE AUTHOR

...view details