మిర్యాలగూడ డివిజన్లోని సాగర్ ఆయకట్టుకు పాలేరు నుంచి నీళ్లిచ్చేలా ఎత్తిపోతల పథకం నిర్మించే అంశాన్ని పరిశీలించాలని నీటిపారుదల శాఖను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఎత్తిపోతల పథకం కోసం సర్వే నిర్వహించాలని అధికారులకు సూచించారు. ప్రజాప్రతినిధులు, ఇంజినీర్లు, అధికారులతో ప్రగతిభవన్‌లో సమావేశమైన సీఎం కేసీఆర్... నీటిపారుదల సంబంధిత అంశాలపై సమీక్షించారు. ప్రాజెక్టుల నిర్మాణంతో రాష్ట్రానికి సాగునీటి సమస్య తీరుతుందన్న ముఖ్యమంత్రి... కాళేశ్వరం, దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల వల్ల గోదావరి నుంచి మన వాటా ప్రకారం పుష్కలమైన నీటిని తీసుకుంటామని చెప్పారు. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు నుంచే 500టీఎంసీలకుపైగా నీరు తీసుకొని ఎల్లంపల్లి, మధ్యమానేరు, దిగువ మానేరు, ఎస్సారెస్పీతో పాటు కొత్తవైన మల్లన్నసాగర్, కొండ పోచమ్మసాగర్, బస్వాపూర్ తదితర జలాశయాలు నింపుతామని వివరించారు. అన్నిచెరువులకు ప్రాజెక్టుల ద్వారా నీరిస్తామని తెలిపారు.
బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తాం
రాష్ట్రవ్యాప్తంగా అన్నిప్రాంతాల్లో జలధార ఉంటుందని పుష్కలమైన పంటలుపండుతాయని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. పంటలకు నీళ్లిచ్చే క్రమంలో నీళ్లు, వర్షంతో సహజంగా ఏర్పడిన వాగులు, వంకలు, డొంకల ద్వారా కిందికి వెళ్లిపోకుండా ఎక్కడికక్కడ ఆపేలా చెక్‌డ్యాంల నిర్మాణం జరగాలని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో వాగులపై ఉన్న చెక్ డ్యాంలు, అవసరాలకు సంబంధించిన లెక్కలు తీయాలని ఇంజినీర్లను ఆదేశించారు. అవసరమయ్యే చెక్‌డ్యాంలలో ఈ ఏడాది సగం, వచ్చే ఏడాది మిగతా సగం నిర్మించాలని తెలిపారు. చెక్ డ్యాంల నిర్మాణం కోసం ఈ నెల 15 వరకు టెండర్లు పిలవాలన్న కేసీఆర్... ఇందుకు బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తామని చెప్పారు.
గతంలోని నీరటి కాడు వ్యవస్థను పునరుద్ధరించాలి...