chatbot app helps to find mobile : సెల్‌ఫోన్ పోతే తిరిగి దక్కించుకోవడం ఎంత కష్టమో తెలిసిందే. పోగొట్టుకున్న సెల్‌ఫోన్‌ను వెతికిపెట్టేందుకు అనంతపురం జిల్లా పోలీసులు ‘చాట్ బాట్’ పేరుతో వినూత్న సేవలను అందుబాటులోకి తెచ్చారు. సెల్‌ఫోన్ పోగొట్టుకున్నవారు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లక్కర్లేకుండా, ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాల్సిన పని లేకుండా వాట్సాప్ మెసేజ్ చేస్తే చాలు.. పోగొట్టుకున్న ఫోన్‌ను రికవరీ చేసి, బాధితులకు అందజేస్తున్నారు. అనంతపురం ఎస్పీ ఫక్కీరప్ప ఆధ్వర్యంలో ‘చాట్ బాట్’ సాంకేతికతను జూన్ 27న అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఎలా పని చేస్తుందంటే..సెల్‌ఫోన్ పోగొట్టుకున్న/ చోరీకి గురైనవారు ముందుగా 94407 96812 నంబర్ వాట్సాప్‌కు ఆంగ్లంలో ‘హాయ్’ లేదా ‘హెల్ప్’ అని మెసేజ్ పంపాలి.
వెంటనే ‘వెల్‌కమ్ టు అనంతపురం పోలీస్’ పేరున లింకు వస్తుంది. అందులో గూగుల్ ఫార్మాట్ ఓపెన్ అవుతుంది. దానిలో జిల్లా, పేరు, వయసు, తండ్రి పేరు, చిరునామా, కాంటాక్ట్ నంబర్, పోయిన ఫోన్ మోడల్, ఐఎంఈఐ నంబర్, మిస్సయిన ప్రాంతం తదితర వివరాలను నమోదు చేయాలి.
వివరాలు నమోదు చేయగానే ఫిర్యాదు వెళ్తుంది. దీనిని పర్యవేక్షించడానికి జిల్లా పోలీసు కార్యాలయంలో 8 మందితో కూడిన ప్రత్యేక సాంకేతిక బృందం పని చేస్తోంది.