తెలంగాణ

telangana

ETV Bharat / city

తరగతి నిర్మాణం జాప్యమవుతోందని.. విద్యా సంవత్సరాన్నే మార్చేశారు? - ఏపీలో జులైలో పాఠశాలలు

ఏపీలో అదనపు తరగతి గదుల నిర్మాణంలో జాప్యం జరుగుతోంది. ఇవి పూర్తయ్యేందుకు మూడు నెలలకుపైగా సమయం పడుతుంది. దీంతో జూన్‌లో పునఃప్రారంభించాల్సిన పాఠశాలలను జులై 4కు మార్చారు.

changed-the-school-academic-year-in-ap
changed-the-school-academic-year-in-ap

By

Published : Apr 16, 2022, 11:15 AM IST

ఏపీలోని అదనపు తరగతి గదుల నిర్మాణంలో జరుగుతున్న జాప్యం కారణంగా ఇప్పుడు ఏకంగా విద్యా సంవత్సరాన్నే మార్చేశారు. ముందు నుంచి ప్రణాళిక ప్రకారం వ్యవహరించాల్సిన అధికారులు మొదట్లో నిర్లక్ష్యం వహించి, ఇప్పుడు గదుల నిర్మాణం చేపట్టారు. ఇవి పూర్తయ్యేందుకు మూడు నెలలకుపైగా సమయం పడుతుంది. దీంతో జూన్‌లో పునఃప్రారంభించాల్సిన పాఠశాలలను జులై 4కు మార్చారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో విడతల వారీగా ఆరు రకాల పాఠశాలలు రాబోతున్నాయి.

ప్రాథమిక పాఠశాలలకు కిలోమీటరు దూరంలోని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 3,4,5 తరగతులను విలీనం చేస్తారు. అక్కడి మిగిలే 1,2 తరగతులకు కొన్ని చోట్ల అంగన్‌వాడీలను అనుసంధానిస్తారు. ఇలా ఒక చోట నుంచి మరొక చోటకు పిల్లలు మారుతున్నందున అదనపు తరగతి గదులు అవసరం కానున్నాయి. వీటిని ‘నాడు-నేడు’ కింద చేపట్టారు. రెండో విడతకు గతేడాది ఆగస్టు 16న శ్రీకారం చుట్టినా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో పనులు మొదలు కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 18,600 తరగతి గదులు నిర్మించాల్సి ఉంది. ఇందులో 70శాతం మొదటి అంతస్తులో నిర్మించేలా ప్రణాళికలు రూపొందించారు. మొదటి అంతస్తు నిర్మాణాలకు మూడు నెలలకుపైగా సమయం పడుతుంది.ఇవి పూర్తికాకపోతే పాఠశాల విద్యాశాఖ నూతన విద్యా విధానాన్ని ప్రారంభించడం కష్టమవుతుంది.

అకడమిక్‌ను కోల్పోయినా నిర్లక్ష్యమేనా?
కరోనా కారణంగా గత రెండేళ్లు విద్యార్థుల అభ్యసనకు ఆటంకాలు ఏర్పడ్డాయి. ఈ ఏడాది ఆలస్యంగా ఆగస్టు 16 నుంచి బడులు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్‌ 22 నుంచి మే 4వరకు 1-9 తరగతులకు పరీక్షలు పూర్తవుతున్నాయి. పరీక్షల ఫలితాలకు ఒకటి, రెండు రోజులు పడుతుంది. పదో తరగతి పరీక్షలు మే నెల తొమ్మిదితో పూర్తవుతున్నాయి. రెండేళ్లుగా పిల్లలు చదువులు కోల్పోయినందున ఆ నష్టాన్ని భర్తీ చేసేందుకు సెలవులు తగ్గించి, బడులు కొనసాగించాల్సి ఉండగా.. ఇందుకు విరుద్ధంగా జులై 4వరకు సెలవులు ఇవ్వడమేమిటని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు. జూన్‌ 12న తెరవాల్సిన బడులను జులైలో తెరిస్తే సుమారు 18 పని దినాలను విద్యార్థులు కోల్పోతారు. జూన్‌ 15 నాటికి సాధారణంగా ఎండ తీవ్రత తగ్గుతుంది. పాఠశాలలను పునఃప్రారంభించి, గతంలో అభ్యాసన నష్టపోయిన పిల్లలకు బేసిక్స్‌ నేర్పిస్తే బాగుంటుందని సూచిస్తున్నారు. కరోనాకు ముందు వరకు ఏప్రిల్‌ 23 చివరి పని దినం కాగా.. జూన్‌ 12 నుంచి బడులు పునః ప్రారంభమయ్యేవి. ఈ ఏడాది రెండు నెలలు ఆలస్యంగా తెరిచారు. 30శాతం పాఠ్యప్రణాళిక తగ్గించారు. గతంలో ఆన్‌లైన్‌ పాఠాలు కొనసాగించినా ఫోన్లు లేని పేద పిల్లలు అభ్యాసన కోల్పోయారు. ఇప్పటికీ విద్యార్థులు పూర్తి స్థాయిలో తయారు కాలేదు. ఇలాంటి సమయంలో విద్యార్థులను సన్నద్ధం చేయాల్సి ఉండగా.. విద్యా సంవత్సరాన్ని జులైకు మార్చడమేమిటని ప్రశ్నిస్తున్నారు.

బదిలీలు, పదోన్నతులకు నెల సరిపోదా?
నూతన విద్యా విధానంలో 3, 4, 5 తరగతులకు సబ్జెక్టు ఉపాధ్యాయులతో పాఠాలు చెప్పేందుకు స్కూల్‌ అసిస్టెంట్లు (ఎస్‌ఏ)లు భారీగా అవసరం కానున్నారు. ఇందు కోసం సుమారు 20వేల మంది ఎస్జీటీలకు పదోన్నతులు కల్పించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఈ పదోన్నతులు నిర్వహించిన తర్వాత బదిలీలు చేపట్టనున్నారు. ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు నెల రోజులు సరిపోతుందని సిబ్బందే వెల్లడిస్తున్నారు. ఇప్పటికే ఉపాధ్యాయుల వివరాలన్నీ ఆన్‌లైన్‌లో ఉన్నాయి. అకడమిక్‌ ప్రణాళిక ముందుగానే నిర్ణయిస్తారు. అవసరం అనుకుంటే పదోన్నతులు, బదిలీలు పాఠశాలలు ముగియగానే ప్రారంభించవచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details