దేవాలయాల్లో దాడులకు పాల్పడుతున్న అసలు నేరస్తుల్ని పోలీసులు పట్టుకోవాలని.. ఏపీ కుప్పం నియోజకవర్గంలో తెదేపా నాయకులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. గొనుగునూరు గ్రామ పంచాయతీ పేటగుట్టలో సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాల ధ్వంసం ఘటన పరిణామాలపై డీజీపీకి లేఖ రాశారు.
'అధికార పార్టీతో కుమ్మక్కైన ఓ వర్గం పోలీసులు.. రాజకీయ కక్షసాధింపులో అనైతిక చర్యలకు పాల్పడుతున్నారు. అత్యుత్సాహంతో వ్యవహరిస్తున్న పోలీసు అధికారులపై విచారణకు ఆదేశించి చర్యలు తీసుకోవాలి. ప్రార్థనా స్థలాలకు రక్షణ కల్పించి వాటిని కాపాడాలి. రాజకీయాలకు అతీతంగా పోలీసులు చర్యలు తీసుకుంటేనే దాడులు ఆగి.. పోలీసులపై నమ్మకం ఏర్పడుతుంది' అని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వ ఉదాసీన వైఖరి వల్లే 2019 జూన్ నుంచి రాష్ట్రంలో ప్రార్థనా స్థలాలపై దాడులు పెరిగిపోయాయని చంద్రబాబు లేఖలో తెలిపారు.