'8 లక్షల కోట్లు అప్పుచేసి.. 20 వేల కోట్ల పరిహారానికి ఆలోచిస్తున్నారు..' CBN TOUR: ఏపీలోని అల్లూరి జిల్లా గన్నవరంలో ముంపు బాధితులను చంద్రబాబు పరామర్శించారు. జగన్ రూ.8 లక్షల కోట్లు అప్పుచేసి.. పోలవరం బాధితులకు మాత్రం రూ.20 వేల కోట్ల కోసం ఆలోచిస్తున్నారని మండిపడ్డారు. పరిహారానికి కేంద్రం సిద్ధంగా ఉన్నా.. సాధించలేని అసమర్థుడు జగన్ అని దుయ్యబట్టారు. దొంగల చేతికి తాళం ఇచ్చారు.. వారు ఇష్టానుసారం దోచుకుంటున్నారని మండిపడ్డారు. పేటీఎం బ్యాచ్ జగన్‌కు వంద మార్కులు వేస్తే.. ప్రజలు మాత్రం సున్నా మార్కులు వేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ ప్రాంతంలో ఎమ్మెల్సీ ఆనంతబాబు బాధితులు ఎక్కువగా ఉన్నారని.. ఆయనను కాపాడే కొందరు పోలీసులకు ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.
అంతకుముందు తోటపల్లిలో ముంపు బాధితులను చంద్రబాబు పరామర్శించారు. వరద బాధితులను ఆదుకోలేనంటూ సీఎం జగన్ చేతులెత్తేశారని మండిపడ్డారు. బాబాయిని చంపి ఆ కేసు నాపై పెట్టినవాళ్లు.. ఇంకెవరినైనా చంపి మీపై పెడతారని ప్రజలకు హితబోధ చేశారు. నిజాయతీ, విశ్వసనీయత లేని నేతలతో రాష్ట్రానికే ప్రమాదమని సూచించారు. రోడ్డు మార్గాన వెళ్లి పరామర్శించలేని సీఎం మనకు అవసరమా అని ప్రశ్నించారు.
వరదలతో బాధిత ఇళ్లలో ఫ్యాన్ ఆగినందున.. ఎన్నికల్లో వైకాపా ఫ్యాన్‌ను ప్రజలు ఆపాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. పోలవరం పూర్తి చేయటం చేతకాకపోతే జగన్ రెడ్డి రాజీనామా చేయాలని, పోలవరం ఎందుకు పూర్తికాదో తాను చూస్తానని సవాల్ విసిరారు. ముఖ్యమంత్రికి కుట్రలు కుతంత్రాలు తప్ప.. ఇంకేమీ తెలీదని ధ్వజమెత్తారు. హుద్ హుద్ తుపాను సమయంలో తెదేపా ప్రభుత్వం పరిహారం పెంచుతూ ఇచ్చిన జీవో నంబర్ 9ను ఈ ప్రభుత్వం వరద బాధితులకు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏటపాక మండలం నందిగామ పాడు గ్రామంలో వరద ముంపు బాధితుల్ని పరామర్శించిన చంద్రబాబు, పరిహారం ఆమలు బాధ్యత తెలుగుదేశం తీసుకుంటుందని స్పష్టం చేశారు.
CBN TWITTER: గోదావరి ముంపు ప్రాంతమైన కూనవరం మండల కేంద్రంలో ఇళ్ల పరిస్థితి ఇది అంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు ట్విట్టర్లో ఓ వీడియో విడుదల చేశారు.ఆ వీడియోలో ఓ బాధితుడు తన ఇంటిని స్వయంగా కుటుంబ సభ్యులతో కలిసి శుభ్రం చేసుకుంటున్నారు. మోకాలి వరకు పేరుకు పోయిన బురదలో ముక్కుపచ్చలారని చిన్నారులు పడుతున్న కష్టం చూస్తే బాధేస్తోందన్నారు. వరదొచ్చి పది రోజులు దాటుతున్నా ముంపు గ్రామాల్లో ప్రతి చోటా ఇదే పరిస్థితి కనిపిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేనా బాధితులను ఆదుకునే తీరు అని ప్రశ్నించారు. ఆ చిన్నారిని అడిగితే మీ ప్రభుత్వానికి నిజమైన మార్కులు వేస్తుందని ధ్వజమెత్తారు. పరదాలు కట్టి పలకరింపులు కాదు..వాస్తవాలు తెలుసుకోండి..సాయం చేయండని హితవు పలికారు. జగన్ రెడ్డీ.. మీ వరద సాయం ఏపాటిదో.. ఇంట్లో బురద కడుగుతున్న ఈ చిట్టి తల్లిని అడుగు తెలుస్తుందని విమర్శించారు. ఇదేనా కష్టకాలంలో మీరిచ్చిన గొప్ప సాయం అని దుయ్యబట్టారు.
ఇవీ చదవండి: