ప్రాణాలు కాపాడాల్సిన అంబులెన్స్‌లను వైకాపా ప్రభుత్వం ప్రచారానికి వాడుకుంటోందని తెదేపా అధినేత చంద్రబాబు తప్పుబట్టారు. 90 శాతం మందిని అనర్హులుగా చేయడమే.. 90 శాతం హామీలు నెరవేర్చడమా.. అని ప్రశ్నించారు. ఏపీలోని చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ తెదేపా నాయకులతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వైకాపా అవినీతి కుంభకోణాలు, మోసాలను ప్రజల్లో ఎండగట్టాలని పిలుపునిచ్చారు. వైకాపా పతనం ప్రారంభమైనందునే తప్పుడు కేసులు, బెదిరింపులు, వేధింపులతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.
ప్రజల ప్రాణాల కన్నా.. పార్టీ ప్రచారంపైనే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టి పెట్టారని చంద్రబాబు విమర్శించారు. వైద్యం, విద్య, ఉపాధి, పౌష్టికాహారం తదితర సంక్షేమ పథకాలను అందజేసిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని స్పష్టం చేశారు. వైకాపా పాలనలో.. స్కాముల కోసమే స్కీములు పెడుతున్నారని, పేదల సంక్షేమంలోనూ అవినీతికి పాల్పడటం హేయమని చంద్రబాబు మండిపడ్డారు. ఇళ్ల పట్టాల్లో, కరోనా కిట్లు, అంబులెన్స్, బ్లీచింగ్లోనూ అవినీతికి పాల్పడ్డారని తెదేపా అధినేత ఆరోపించారు.