chandrababu in mahanadu:ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైకాపా ఓటమి తథ్యమని జగన్‌ను ఇంటికి పంపించేందుకు ఏపీ ప్రజలు ఎదురు చూస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. ఒంగోలు మహానాడులో భాగంగా నిర్వహించిన బహిరంగ సభకు హాజరైన అశేషప్రజానీకాన్ని ఉద్దేశించి ప్రసంగించిన తెదేపా అధినేత.. సీఎం జగన్‌పై, వైకాపా పాలనపై నిప్పులు చెరిగారు.
ఏపీని అప్పులపాలు చేసి, దివాళా అంచున నిలిపిన జగన్ ను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నది వెనుకబడిన వర్గాలు కాదని... సుబ్బారెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డిలేనని చంద్రబాబు విమర్శించారు. సుబ్రమణ్యం హత్య కేసులో తెదేపా పోరాటంతో ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్టు చేశారని చెప్పారు . మరి వివేకానందరెడ్డి. హత్య కేసులో అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రిని అరెస్టు చేయగలరా? అని సవాల్ చేశారు.
"బాబాయిని చంపి గొడ్డలి పోటును గుండె పోటుగా నమ్మించిన వ్యక్తి రాజకీయాలకు అర్హుడా ? కోడి కత్తి కేసు ఏమైంది?నీకు రోషం ఉంటే.. మీ బాబాయిని హత్య చేసిన వారిని అరెస్టు చేయాలి. రాజధానిగా అమరావతి ఉంటుందని ఎన్నికల ముందు జగన్ చెప్పారా ? లేదా ? వేల కోట్లు ఖర్చు చేసి అమరావతి నిర్మిస్తే.. దాన్ని నిర్వీర్యం చేశారు. అమరావతి పోవడం వల్ల రూ.3లక్షల కోట్ల సంపద ఆవిరైంది." -చంద్రబాబు, తెదేపా అధినేత
మూడేళ్లలో జగన్ దోచుకున్నది రూ.1.75లక్షల కోట్లు:వైకాపా ప్రభుత్వం రూ.8లక్షల కోట్లు అప్పు చేసిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాల పేరిట రూ.లక్షల కోట్లు దోచుకున్నారన్నారు. నిజమైన సంక్షేమం అంటే తెదేపా పథకాలేనని చెప్పారు. రూ.8 లక్షల కోట్ల అప్పును జగన్ చెల్లిస్తారా ? అని నిలదీశారు. 'క్వార్టర్ బాటిల్ ధర రూ.9 ఉండేది. కానీ ఈ ప్రభుత్వం రూ.21 చేసింది. ఇందులో రూ.12 జగన్ జేబులోకి వెళ్తున్నాయి. ప్రతి క్వార్టర్‌పై జగన్ వాటా రూ.12. జంగారెడ్డిగూడెంలో 22 మంది కల్తీ సారాకు బలయ్యారు. ఏ మద్యం షాపులో కూడా బిల్లు ఇవ్వడం లేదు, ఆన్లైన్ పేమెంట్ లేదు. లిక్కర్ ద్వారా ఏటా జగన్ ఆదాయం రూ.5వేల కోట్లు. జగన్ మోహన్ రెడ్డీ... నీ అవినీతి సొమ్మును కక్కిస్తా. బద్వేలులో 8వేల ఎకరాలు కబ్జా చేశారు. బెదిరించి అన్ని పరిశ్రమలను వైకాపా నేతలు స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించి పంచుకు తింటున్నారు. గూగుల్ మ్యాప్‌లు ఉన్నాయి.. అవినీతిని వెలికి తీస్తాం. అన్యాక్రాంతమైన భూమిని ప్రజలకు ఇప్పించే బాధ్యత నాది. జగన్ రెడ్డి మూడేళ్ల పాలనలో రూ.1.75లక్షల కోట్లు దోచుకున్నారు.' అని చంద్రబాబు ఆరోపించారు.
నేను ఆ ఉద్యోగాలు ఇచ్చా.. జగన్ ఈ జాబులు ఇచ్చారు..!:తాను ముఖ్యమంత్రిగా ఐటీ ఉద్యోగాలు కల్పిస్తే.. జగన్ వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చారని ఎద్దేవా చేశారు. అందరికీ అమ్మ ఒడి ఇస్తానని చెప్పి.. చివరికి కండీషన్లు పెట్టారని మండి పడ్డారు. కరోనా కంటే.. రాష్ట్ర విభజన కంటే.. జగన్ విధానాల వల్లే ప్రజలకు ఎక్కువ నష్టం జరిగిందని అన్నారు. 30లక్షల ఇళ్లు కట్టిస్తానని మూడేళ్లలో 3 ఇళ్లు కట్టారని ఎద్దేవా చేశారు. బాబాయిని చంపి గొడ్డలి పోటును గుండె పోటుగా నమ్మించిన వ్యక్తి రాజకీయాలకు అర్హుడా? అని నిలదీశారు. కోడి కత్తి కేసు ఏమైందని ప్రశ్నించారు. జగన్‌కు రోషం ఉంటే.. బాబాయిని హత్య చేసిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. రాజధానిగా అమరావతి ఉంటుందని ఎన్నికల ముందు చెప్పిన జగన్.. వేల కోట్లు ఖర్చు చేసి నిర్మించిన అమరావతిని నిర్వీర్యం చేశారని మండి పడ్డారు. అమరావతి స్తంభించిపోవడం వల్ల రూ.3లక్షల కోట్ల సంపద ఆవిరైందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని అన్నారు.
సినిమాలపైనా దాడి..:జగన్ సర్కారు సినిమాలపైనా దాడి చేసిందని ధ్వజమెత్తారు. బాలకృష్ణ సినిమాపై జగన్ ప్రభుత్వం ఆంక్షలు పెట్టిందని, అయినా అడ్డంకులను అధిగమించి అఖండ సినిమా విజయం సాధించిందన్నారు. సినిమా వాళ్లను గుప్పిట్లో పెట్టుకోవాలని జగన్ చూస్తున్నారని మండిపడ్డారు. "బాదుడే బాదుడు"కు పోటీగా.. గడపగడపకు ప్రభుత్వం అని నిర్వహించారని, కానీ.. గడపగడపకు వెళ్తే మంత్రులను ప్రజలు నిలదీస్తున్నారని చంద్రబాబు అన్నారు. దీంతో.. గడపగడపకు కార్యక్రమాన్ని రద్దు చేసి బస్సుయాత్ర చేస్తున్నారని ఎద్దేవా చేశారు.