ఆంధ్రప్రదేశ్ శాసనసభలో జరిగిన పరిణామాలపై తెదేపా అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. వైకాపా సభ్యులు.. ఏకంగా ఆయన సతీమణి భువనేశ్వరిని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని కన్నీటి పర్యంతమయ్యారు. మంగళగిరిలోని తెదేపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెక్కి వెక్కి ఏడ్చారు. తన భార్య వ్యక్తిత్వాన్ని కించపరిచేలా తీవ్రంగా అవమానించారంటూ... మాటలు తడబడుతూ ఉద్వేగాన్ని ఆపుకోలేకపోయారు. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా చలించని చంద్రబాబు.... కష్టనష్టాల్లో తోడుగా నిలిచిన సతీమణిని అనరాని మాటలు అన్నారంటూ తీవ్రంగా ఆవేదన చెందారు. ఇలాంటి అవమానం తట్టుకోలేనంటూ వెక్కివెక్కి ఏడ్చారు. ఉబికివస్తున్న కన్నీటిని చేతి రుమాలుతో తుడుచుకునే ప్రయత్నం చేసినా.... అవమానభారంతో ఆయనకు ఉద్వేగం ఆగలేదు. అధినేత రోదించడాన్ని చూసి తెలుగుదేశం నేతలు నిశ్చేష్టులయ్యారు. ఎలాంటి పరిస్థితులనైనా మొక్కవోని ధైర్యంతో దీటుగా ఎదుర్కొనే చంద్రబాబు.... ఒక్కసారిగా ఏడవడంతో వాళ్లూ కంటతడి పెట్టారు.
Chandrababu news today: ఇది గౌరవ సభా.. కౌరవ సభా: చంద్రబాబు - తెలంగాణ వార్తలు
14:56 November 19
మీడియా సమావేశంలో వెక్కివెక్కి ఏడ్చిన చంద్రబాబు
14:49 November 19
భావోద్వేగంతో వెక్కివెక్కి ఏడ్చిన చంద్రబాబు
'నా భార్య ఏరోజూ రాజకీయాల్లోకి రాలేదు.. ఇవాళ ఏకంగా నా భార్యను కించపరిచేలా దూషించారు.. నా జీవితంలో ఇలాంటి పరిణామాలు ఎప్పుడూ చూడలేదు.. నా రాజకీయ జీవితంలో ఇంత బాధ ఎప్పుడూ భరించలేదు.. బూతులు తిట్టినా, ఎన్ని అవమానాలకు గురిచేసినా భరించాం' అని చంద్రబాబు కన్నీటిపర్యంతమయ్యారు.
తిట్టలేక కాదు.. అది మా విధానం కాదు!
ఏపీ సభాపతి తమ్మినేని కూడా ఆలోచించుకోవాలని చంద్రబాబు అన్నారు. తాను మాట్లాడుతుండగానే మైక్ కట్‌చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తమ్మినేని తెదేపా ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారని... గౌరవంగా బతికేవాళ్లను కూడా వైకాపా సభ్యులు కించపరుస్తున్నారని కన్నీటిపర్యంతమయ్యారు. '40 ఏళ్లు పనిచేసింది.. ఇలా అవమానపడడానికా అని బాధపడుతున్నా.. అవతలివారు బూతులు తిడుతున్నా... సంయమనం పాటిస్తున్నా.. నాకు బూతులు రాక... తిట్టలేక కాదు... అది మా విధానం కాదు.. ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు కూడా ఇంత బాధపడలేదని చంద్రబాబు కంటతడి పెట్టుకున్నారు.
14:47 November 19
మీడియా సమావేశంలో చంద్రబాబు కన్నీటిపర్యంతం
'నా రాజకీయ జీవితంలో ఇంత బాధ ఎప్పుడూ భరించలేదు. రెండున్నరేళ్ల నుంచి అన్నివిధాలా అవమానిస్తున్నారు. ఆర్థికంగా, రాజకీయంగా పార్టీని, నేతలను ఎన్నో ఇబ్బందులు పెట్టినా భరించాం. బూతులు తిట్టినా, ఎన్ని అవమానాలకు గురిచేసినా భరించాం. నిన్న కూడా బీఏసీలో జగన్ అవహేళనగా మాట్లాడారు. ఇవాళ శాసనసభలో ఏకంగా నా భార్యను కించపరిచేలా దూషించారు.'
-చంద్రబాబు, తెదేపా అధినేత
'అంతవరకూ అసెంబ్లీకి వెళ్లను'
ధర్మ పోరాటంలో ప్రజలు సహకరించాలని చంద్రబాబు కోరారు. క్షేత్రస్థాయిలో తేల్చుకున్న తర్వాతే అసెంబ్లీకి వెళ్తానని తెలిపారు. అంతవరకూ అసెంబ్లీకి వెళ్లనని చెప్పారు. ఈ నిర్ణయాన్నే అసెంబ్లీలో చెప్పాలనుకున్నానని... అక్కడ మైక్ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ చెబుతున్నానని పేర్కొన్నారు. ప్రజలు సహకరిస్తే ఏపీని కాపాడుకునేందుకు సహకరిస్తాన్న చంద్రబాబు... అందరం మనుషులమేనని.. విజ్ఞులైన ప్రజలంతా ఆలోచించాలని సూచించారు.
13:43 November 19
మీడియా సమావేశంలో వెక్కివెక్కి ఏడ్చిన చంద్రబాబు
ఆనాడు నా తల్లిని వైఎస్ అవమానించారు..
అధికారంలో ఉన్నప్పుడూ నేనెవరినీ కించపరచలేదు. నిండు కౌరవసభలో ఆనాడు ద్రౌపదికి అవమానం జరిగింది. ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా బాధ్యతగా భావించా. ఈ కౌరవ సభ... గౌరవం లేని సభ. గతంలో వైఎస్ కూడా అసెంబ్లీలో నా తల్లిని అవమానించారు. ఆనాడు వైఎస్ తప్పు ఒప్పుకొని నాకు క్షమాపణ చెప్పారు. జగన్ ప్రజల పాలిట భస్మాసురుడిగా మారారు. ఇవాళ్టి ఘటనలను ఏవిధంగా అభివర్ణించాలో అర్థం కాలేదు.
-చంద్రబాబు, తెదేపా అధినేత
ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి... నాకు పదవులు అవసరం లేదు. నా రికార్డులు బద్ధలు కొట్టాలంటే చాలా సమయం పడుతుంది. ప్రజల కోసం ఇంటికి రాకుండా ఎంతకాలం పనిచేసినా నా భార్య ప్రోత్సహించారు.
-చంద్రబాబు, తెదేపా అధినేత