chandrababu : నర్సీపట్నంలో తెదేపా నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఎలాంటి ఆక్రమణకు పాల్పడలేదని.. ఇడుపులపాయలో వైఎస్ కుటుంబం దళితులకు చెందిన 600 ఎకరాల్ని చెరబట్టడమే నిజమైన కబ్జా అని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. అయ్యన్న ఇంటిపై ప్రభుత్వ దాడికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. అయ్యన్న ఇంటి ప్రహరీ కూల్చివేయడం వైకాపా ప్రభుత్వ కక్ష సాధింపేనన్న తమ వాదన నిజమని కోర్టు వ్యాఖ్యల ద్వారా రుజువైందన్నారు.
‘అర్ధరాత్రి కూల్చివేయాల్సిన అవసరం ఏంటన్న కోర్టు వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి జగన్ ఏం సమాధానం చెబుతారు? నిత్యం తెదేపా నేతల అరెస్టులు ఆయన పిరికితనాన్ని చాటుతున్నాయి. అయ్యన్న ఇంటిని కూల్చివేసేందుకు ముగ్గురు ఐపీఎస్‌లను, వందల మంది పోలీసులను, సమస్త రెవెన్యూ అధికారులను మోహరించడం.. పతనమైన ఈ ప్రభుత్వ ఆలోచనలకు పరాకాష్ఠ.' అని చంద్రబాబు మండిపడ్డారు.
'తెదేపా సభలు విజయవంతమవడం, వైకాపా ప్రభుత్వ అరాచకాలపై ప్రజల నుంచి తిరుగుబాటు మొదలవడంతో తీవ్ర నిస్పృహలో కూరుకుపోయిన జగన్ తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. ఉత్తరాంధ్రలో నాడు సబ్బం హరి, పల్లా శ్రీనివాస్ ఇళ్లు, ఆస్తులపై ప్రభుత్వ చర్యల ముసుగులో దాడి చేయించిన జగన్ ఇప్పుడు అయ్యన్న ఇంటిపై దౌర్జన్యానికి దిగారు. అలాంటి దాడులు, కక్ష సాధింపు చర్యలకు తెదేపా నేతలెవరూ భయపడరు’ అని స్పష్టం చేశారు.
చలో నర్సీపట్నం కార్యక్రమానికి వెళుతున్న తెదేపా నేతల్ని అరెస్ట్ చేయడాన్ని చంద్రబాబు ఖండించారు. ‘గట్టిగా గళం వినిపిస్తున్న తెదేపా బీసీ నేతలపై కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం, వారి ఇళ్లపై దాడులతో జగన్ వేధింపులకు పాల్పడుతున్నారు. జగన్ కక్ష సాధింపు చర్యలకు సాయపడుతూ, ఆయన ఆదేశాల ప్రకారం కోర్టు నిబంధనల్ని ఉల్లంఘిస్తున్న ప్రతి అధికారీ మూల్యం చెల్లించుకోక తప్పదు’ అని హెచ్చరించారు. తప్పు చేసిన అధికారుల్ని జైలుకి పంపుతామన్నారు. ప్రభుత్వ ప్రాపకం కోసం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి చిక్కుల్లో పడవద్దని అధికారులకు చంద్రబాబు హితవు పలికారు.