ఏపీ పంచాయతీ ఎన్నికలకు పార్టీ ప్రణాళికను తెదేపా అధినేత చంద్రబాబు గురువారం విడుదల చేశారు. ‘పల్లె ప్రగతికి పంచ సూత్రాలు’ పేరుతో.. ‘పల్లెలు మళ్లీ వెలగాలి’ అన్న నినాదంతో తెదేపా ఈ ప్రణాళికను రూపొందించింది. పంచాయతీ ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరుగుతున్నా.. తెదేపా మద్దతుతో పోటీచేసే అభ్యర్థులను గెలిపించాలని కోరేందుకు, వారు గెలిస్తే గ్రామాల స్వయం సమృద్ధి కోసం కృషి చేస్తారని ప్రజలకు హామీ ఇచ్చేందుకు ఈ ప్రణాళిక రూపొందించినట్టు చంద్రబాబు పేర్కొన్నారు.
ముఖ్యాంశాలు..
1. రక్షిత తాగునీరు
ప్రతి ఇంటికీ రక్షిత తాగునీరు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఉచితంగా నీటి కుళాయిలు.
2. భద్రత, ప్రశాంతతకు భరోసా
- నేర రహిత గ్రామాలుగా తీర్చిదిద్దుతాం. గ్రామాల్లోని ప్రధాన కూడళ్లతోపాటు పాఠశాలలు, ప్రార్థనా మందిరాలు, దేవాలయాలు, పవిత్ర స్థలాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి శాంతి భద్రతలను పరిరక్షిస్తాం.
- బాలికల విద్యకు ప్రోత్సాహం. ప్రతి వీధిలో ఎల్ఈడీ దీపాలు. పట్టా భూములు, అసైన్డ్ భూముల కబ్జా జరగకుండా చర్యలు. భూ సర్వేలో భూ యాజమాన్య హక్కుల తారుమారుపై నిఘా.
3. ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దడం
- పారిశుద్ధ్యం, చెత్త సేకరణ, పరిసరాల పరిశుభ్రతతో గ్రామాలను ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దడం. మురుగునీటి కాల్వల నిర్మాణం.
- చెత్త నుంచి సంపద సృష్టించే షెడ్ల నిర్వహణ, నిర్మాణాలు. ఓవర్హెడ్ ట్యాంకులను క్రమం తప్పకుండా శుభ్రపరచడం. పారిశుద్ధ్య కార్మికులకు సకాలంలో జీతాలు. ప్రజలపై భారం వేయకుండా ఇళ్ల నుంచి చెత్త సేకరణ.
- తెదేపా అధికారంలోకి రాగానే అర్హత ఉన్న ప్రతి కుటుంబానికీ 100 గజాల్లో రూ.3 లక్షలతో ఇళ్ల నిర్మాణం.
- అంగన్వాడీ కార్యకర్తల సహకారంతో చిన్నారులకు పోషకాహారం.
- ప్రతి గ్రామంలో శ్మశానవాటికకు అవసరమైన స్థలం.
- ప్రతి గ్రామంలో ఉచిత వై-ఫై సౌకర్యం.
- గ్రామాల్లోని రహదారులను 100% సిమెంటు రోడ్లుగా మార్చడం.
4. స్వయం సమృద్ధి
- వ్యవసాయ మోటార్లకు విద్యుత్తు మీటర్ల బిగింపు పథకాన్ని వ్యతిరేకిస్తూ పంచాయతీలో తొలి తీర్మానం.
- పంచాయతీల సహకారంతో మహిళలకు, వెనుకబడిన కులాలకు బ్యాంకుల నుంచి వడ్డీ లేని రుణాలు.
- మహిళా సాధికారతను ప్రోత్సహిస్తూ గ్రామాల్లో నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు.
- ఉపాధి హామీ కూలీలకు సకాలంలో వేతనాలు, 100-150 రోజుల పనిదినాలు.
- గ్రామాల్లో పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం- పంట కుంటల నిర్మాణం.
- స్థానిక సంస్థలకు తగినన్ని నిధుల కోసం 74వ రాజ్యాంగ సవరణ అమలుకు కృషి.
5. ఆస్తి పన్ను తగ్గింపు - పౌర సేవలు:
- అధికారం చేపట్టిన 60 రోజుల్లోపే గ్రామాల్లో సమగ్ర సర్వే చేపట్టి గ్రామసభ ద్వారా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందించడంతోపాటు కొవిడ్ టీకా అందించేలా చర్యలు.
- పేదలపై భారంగా ఉన్న ఆస్తి పన్ను 50% తగ్గింపు - పన్ను బకాయిలపై రాయితీ.
బలవంతపు ఏకగ్రీవాలు ఉపేక్షించబోం..
వైకాపా చెప్తున్న ఏకగ్రీవాలు ప్రజల ఆమోదంతో జరిగేవి కావని... దౌర్జన్యాలు, దాడులతో భయపెట్టి చేసే బలవంతపు ఏకగ్రీవాలని చంద్రబాబు విమర్శించారు. ఇటీవల జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ విధ్వంసాలే ఉదాహరణగా పేర్కొన్నారు. వివిధ ఘటనలకు సంబంధించిన వీడియోలను చంద్రబాబు మీడియాకు చూపించారు. ప్రజల ఆమోదం లేని ఈ తరహా ఏకగ్రీవాలు ఉపేక్షించేది లేదని... ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. ప్రజాస్వామ్యం ఏ విధంగా ఖూనీ అయిందో ఈ ఘటనలే ఉదాహరణ అని మండిపడ్డారు.