Babu on KCR National Party: బెజవాడ దుర్గమ్మను తెదేపా అధినేత చంద్రబాబు దంపతులు దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో చంద్రబాబుకు అధికారులు ఘనస్వాగతం పలికారు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం చంద్రబాబు దంపతులకు వేదపండితులు వేదాశీర్వచనాలు పలికారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు. దుర్గమ్మ ఆశీస్సులతో సకల జనులకు మంచి జరగాలని కోరుకున్నారు. దుర్గమ్మ కరుణాకటాక్షాలు ఏపీ ప్రజలపై ఉండాలని.. రాష్ట్రం సుభిక్షమై, సుసంపన్నమై వెలిగే రోజులు రావాలని ఆకాక్షించారు. ఈ సందర్భంగా తెరాస అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీపై ప్రకటనపై మీడియా ప్రతినిధులు చంద్రబాబు స్పందన కోరగా.. ఓ నవ్వు నవ్వి అక్కడ నుంచి ఆయన వెళ్లిపోయారు.
"అమరావతి రాష్ట్ర ప్రజలందరి సంకల్పం.. దేవతల ఆశీర్వాదం. రాజధాని అమరావతిపై రోజుకోమాట తగదు. దుర్గమ్మ ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలి. విజయదశమి రోజు ఏ కార్యక్రమమైనా ముహూర్తంతో పని ఉండదు. దుష్టశక్తులను తుదముట్టించే శక్తి దుర్గమ్మకు ఉంది. మాట తప్పేవారిని దుర్గమ్మ కూడా క్షమించదు. ప్రజా సంకల్పం, దుర్గమ్మ ఆశీస్సులతో రాజధాని ప్రకటించాం"- చంద్రబాబు, తెదేపా జాతీయ అధ్యక్షుడు