ఏపీలోని చిత్తూరు, తిరుపతిలో తలపెట్టిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన తెలుగుదేశం అధినేత చంద్రబాబును.. అనుమతి లేదంటూ రేణిగుంట విమానాశ్రయంలోనే పోలీసులు ఆపేశారు. పురపాలక ఎన్నికల కోడ్, కరోనా నిబంధనల కారణంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతాయని.. చిత్తూరు పోలీసులు నోటీసులు ఆయనకు ఇచ్చారు. ఉదయం తొమ్మిదిన్నర గంటలకు విమానాశ్రయానికి చేరుకున్న చంద్రబాబును.. బయటికి రాకుండా పోలీసులు అడ్డుకున్నారు.
ఫోన్లను లాక్కున పోలీసులు..
పోలీసుల తీరును నిరసిస్తూ నేలపైనే బైఠాయించి చంద్రబాబు నిరసన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యయుతంగా ప్రజల్లోకి వెళ్లేందుకు అభ్యంతరమేంటని ప్రశ్నించారు. అనుమతి ఎందుకు ఇవ్వడం లేదో నేరుగా తెలుసుకుంటానంటూ... చిత్తూరు జిల్లా కలెక్టర్, ఎస్పీలను కలుస్తానని చెప్పారు. బయటికి వెళ్లేందుకు కుదరదన్న తిరుపతి అర్బన్ ఎస్పీ, ఆర్డీవో... వెనక్కి వెళ్లిపోవాలని చంద్రబాబును కోరారు. తర్వాత చంద్రబాబుతో పాటు ఆయన పీఏ, వైద్యాధికారి ఫోన్లను పోలీసులు లాక్కున్నారు.
అణచివేత చర్యలతో ఆపలేరు: చంద్రబాబు
రేణిగుంట విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తూ చంద్రబాబు ట్వీట్ చేశారు. ఇలాంటి నిరంకుశ, అణచివేత చర్యలతో తమను ఆపలేరని తేల్చిచెప్పారు. పోలీసుల్ని అడ్డుపెట్టుకుని ఏపీ ప్రభుత్వం తమ గొంతు నొక్కలేదని, ప్రజల్ని కలవకుండా అడ్డుకోలేదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించడం నేర్చుకోవాలని ముఖ్యమంత్రి జగన్‌కు హితవు పలికారు. సుమారు 10 గంటలపాటు విమానాశ్రయంలోనే చంద్రబాబు నిరసన వ్యక్తం చేశారు. సాయంత్రం హైదరాబాద్కు తిరిగి వచ్చారు.
అంతకుముందు చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు విమానాశ్రయానికి పెద్దఎత్తున చేరుకున్న తెలుగుదేశం నేతలను పోలీసులు అడ్డుకున్నారు. తిరుపతికి చెందిన ముఖ్యనేతలు, కార్యకర్తలను విమానాశ్రయం బయటే ఆపేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రైల్వేకోడూరు నియోజకవర్గ నేత నరసింహ ప్రసాద్ సహా ఇతర నేతలను అక్కడి నుంచి నెట్టివేశారు. చిత్తూరులో ఎమ్మెల్సీ దొరబాబు, చిత్తూరు లోక్‌సభ ఇన్‌ఛార్జ్ పులివర్తి నానిని, పలమనేరులో మాజీ మంత్రి అమరనాథ్ రెడ్డిని గృహ నిర్బంధం చేశారు. రేణిగుంట విమానాశ్రయానికి వెళ్తున్న తెలుగుదేశం నేత నర్సింహయాదవ్‌ను తిరుపతిలో అదుపులోకి తీసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మను గృహనిర్బంధం చేశారు. తన భర్త వెంకటరమణ జయంతి నాడు సమాధి వద్ద నివాళులర్పించేందుకు వెళ్తున్న తమను అడ్డుకోవటంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రేణిగుంట విమానాశ్రయంలో చంద్రబాబు అడ్డగింత.. ఎప్పుడేం జరిగిందంటే? సంబంధిత కథనాలు: