తెలంగాణ

telangana

ETV Bharat / city

తెలుగువారి ఆత్మగౌరవం ప్రపంచానికి చాటిన ఘనత ఎన్టీఆర్‌దే: చంద్రబాబు

నష్టపోతున్న తెలుగుజాతి ఉద్ధరణకే ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీని స్థాపించారని ఆ పార్టీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. తెలుగువారి ఆత్మగౌరవం ప్రపంచానికి చాటిన ఘనత ఎన్టీఆర్‌దేనని పేర్కొన్నారు.

By

Published : Mar 29, 2021, 8:07 PM IST

tdp president chandrababu
తెలుగుదేశం అధినేత చంద్రబాబు

సేవాభావం, పేదల సంక్షేమం కోసమే రాజకీయాలని ఎన్టీఆర్ చెప్పారని తెదేపా అధినేత చంద్రబాబు గుర్తు చేశారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్‌లో తెదేపా 40వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన చంద్రబాబు.. పార్టీ జెండాను ఆవిష్కరించారు. రైతు సంక్షేమానికి సరికొత్త కార్యక్రమాలు తెచ్చిన ఘనత ఎన్టీఆర్‌దేనని చంద్రబాబు అన్నారు. పేదల పక్కా ఇళ్లకు 40ఏళ్ల క్రితమే శ్రీకారం చుట్టిన పార్టీ తెదేపా అని వ్యాఖ్యానించారు. తెదేపా ఆవిర్భావ వేడుకల్లో భాగంగా పార్టీ కార్యాలయ ప్రాంగణంలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మెుక్క నాటారు.

కేసీఆర్ మాటలు గ్రహించాలి...

ఏపీలో ఎకరం అమ్మితే తెలంగాణలో 3 ఎకరాలు కొనే పరిస్థితులు రివర్స్ అయ్యాయన్న కేసీఆర్ మాటలు అంతా గ్రహించాలని చంద్రబాబు సూచించారు. ఆంధ్రప్రదేశ్​లో రాష్ట్రాభివృద్ధి రివర్స్ గేర్​లో పయనిస్తోందని మండిపడ్డారు. రాజకీయ పార్టీల ప్రాముఖ్యత సంపద దోచుకోవటం కాదని, భావితరాల భవిష్యత్ బాగుండేలా కృషి చేయటమేనని స్పష్టం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను, వైఎస్, ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కొనసాగించారని స్పష్టం చేశారు.

ఆనాడు హైదరాబాద్ అభివృద్ధిలో తెలుగుదేశం ప్రభుత్వం జినోమ్ వ్యాలీకి శ్రీకారం చుట్టిందన్నారు. ఈనాడు అక్కడే కరోనా వైరస్​కు వ్యాక్సిన్ కనుగొన్నారని గుర్తు చేశారు. త్యాగాల కోసం పనిచేసే కుటుంబం లాంటి పార్టీ తెలుగుదేశమన్నారు. 40 ఏళ్లలో 21 ఏళ్లు అధికారంలో ఉన్న పార్టీ తెలుగుదేశమన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల రుణం ఎప్పటికప్పుడు తీర్చుకుంటూ వచ్చామని, గత 2 ఏళ్లలో ప్రతి కుటుంబంపై రూ.2.50 లక్షల భారం మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్య ప్రజలు బతకలేని విధంగా అన్ని ధరలు పెంచేశారని, కొవిడ్ తర్వాత ఆర్థిక అసమానతలు బాగా పెరిగాయన్నారు.

ఇచ్చేది గోరంత.. దోచేది కొండంత

'28 మంది ఎంపీలు కేంద్రం నుంచి ఏం తెచ్చారో చెప్పాలి? రెండేళ్లలో ఉద్యోగాలు ఇచ్చే ఒక్క పరిశ్రమనైనా తెచ్చారా? కేసుల మాఫీ కోసం విశాఖ ఉక్కు పరిశ్రమను తాకట్టు పెట్టారు. నాసిరకం మద్యంతో రూ.వేల కోట్లు దండుకుంటున్నారు. ఆదాయానికి మించి అప్పులు చేయడం దివాళా కాక మరేంటి? అసెంబ్లీలో బడ్జెట్ ఆమోదించుకునే పరిస్థితిలోనూ ప్రభుత్వం లేదు. వైకాపా ప్రభుత్వం ఇచ్చేది గోరంత, దోచేది కొండంత. మా కార్యకర్తలకు చేసిన నష్టాన్ని వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాం.'

- చంద్రబాబు, తెదేపా అధినేత

ఇదీ చదవండి:వరి ధాన్యం కొనుగోళ్లపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం

ABOUT THE AUTHOR

...view details