CBN on tirupathi meeting: అమరావతిని కాపాడుకోవాలన్న ఆకాంక్ష ఏపీలోని అన్ని ప్రాంతాల్లో బలంగా ఉందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. రాజధాని రైతుల మహాపాదయాత్ర ముగింపు సందర్భంగా తిరుపతిలో నిర్వహించిన సభకు విశేష ఆదరణ లభించడమే.. దానికి నిదర్శనమని చంద్రబాబు పేర్కొన్నారు. పార్టీ ముఖ్య నేతలతో ఆయన శనివారం రోజు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. తిరుపతి సభ విజయవంతం కావడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 3 రాజధానుల పేరుతో అమరావతిని నాశనం చేయడం వల్ల.. రాష్ట్రానికి జరిగే నష్టాన్ని ప్రజలకు మరింతగా వివరించాలని పార్టీ నేతలకు సూచించారు.
Chandrababu fire on OTS: పేద ప్రజల మెడకు వన్ టైమ్ సెటిల్‌మెంట్ (ఓటీఎస్) ఉరితాడులా మారిందని చంద్రబాబు తెలిపారు. దాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం అన్ని మండల కేంద్రాల్లో, మున్సిపల్ కమిషనర్ల కార్యాలయాల ఎదుట తెలుగుదేశం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు నిర్వహించాలని సూచించారు. వైకాపా అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు ఒక్క ఇళ్లు కూడా కట్టలేదని ఆరోపించారు. తెలుగుదేశం హయాంలో నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వకుండా ప్రభుత్వం అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. గౌరవ సభల పేరుతో పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమాలకు మంచి స్పందన వస్తోందని తెలిపారు. పార్టీ నేతలంతా ఇకపై నిరంతరం క్షేత్రస్థాయి పర్యటనలతో ప్రజలకు అందుబాటులో ఉండాలని తెదేపా అధినేత కోరారు. ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని పార్టీ నేతలకు సూచించారు.