తెలంగాణ

telangana

ETV Bharat / city

అమరావతిపై మోదీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి: చంద్రబాబు - amaravati updates

దిల్లీకి ధీటుగా ఏపీ రాజదాని అమరావతిని నిర్మిద్దాం అని శంకుస్థాపన రోజు ప్రధాని మోదీ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని తెదేపా అధినేత చంద్రబాబు కోరారు. తాను శంకుస్థాపన చేసిన అమరావతి ప్రాజెక్టును కాపాడాల్సిన బాధ్యత ప్రధాని మోదీపై ఉంటే... రాజధానిగా కొనసాగించే బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలన్నారు. అమరావతి కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్న ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు. అల్లూరి స్ఫూర్తితో అమరావతి ఉద్యమం కొనసాగాలని ఆకాంక్షించారు. అయోధ్య తరహాలో అమరావతిలో 'రామమందిరం' నిర్మించనున్న హిందూ మహాసభ నిర్ణయాన్ని చంద్రబాబు ఆహ్వానించారు.

chandrababu
అమరావతిపై మోదీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి: చంద్రబాబు

By

Published : Jul 4, 2020, 8:48 PM IST

ఆంధ్రప్రదేశ్​లోనిఅమరావతి ఉద్యమం 200 రోజులకుచేరిన సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబు పార్టీ ముఖ్యనేతలతో కలిసి కేంద్ర కార్యాలయమైన ఎన్టీఆర్‌ భవన్‌లో నిరసన దీక్షకు కూర్చున్నారు. భౌతిక దూరం పాటిస్తూ చంద్రబాబుతో పాటు నిమ్మకాయల చినరాజప్ప, నక్కా ఆనంద్ బాబు, కనకమేడల రవీంద్ర కుమార్, అశోక్ బాబు, బచ్చుల అర్జునుడు, వర్ల రామయ్య, తంగిరాలసౌమ్య, పట్టాభి తదితరులు దీక్షలో పాల్గొన్నారు.

అల్లూరి సీతారామ రాజు 124వ జయంతి సందర్భంగా చంద్రబాబు ఆయన చిత్రపటానికి ఎన్టీఆర్ భవన్ లో నివాళులర్పించారు. ప్రాణాలు పోతున్నా ఎక్కడా రాజీపడని వ్యక్తి అల్లూరి సీతారామరాజని కొనియాడారు. బ్రిటిష్ పాలననుంచి దేశాన్ని విముక్తం చేసేందుకు రాజీలేని పోరాటం చేశారని గుర్తు చేశారు. అమరావతి ఉద్యమానికి అల్లూరి స్ఫూర్తి కావాలని చంద్రబాబు ఆకాంక్షించారు. అమరావతి కోసం మనోవేదనతో ప్రాణాలు కోల్పోయిన 66 మంది రైతులు, మహిళలు, రైతుకూలీలకు చంద్రబాబు నివాళులర్పించారు.

అమరావతి అజరామరం

అమరావతి అజరామరమన్నచంద్రబాబు... ఎవరైనా చంపాలనుకున్నా, దెబ్బతీయాలనుకున్నా అవి కుటిల ప్రయత్నాలే అవుతాయని స్పష్టం చేశారు. అమరావతి సంకల్ప బలం గొప్పదన్నారు. ప్రభుత్వ విధానాలు తప్పుపట్టిన నిర్మలా సీతారామన్ పైనా వ్యక్తిగత విమర్శలు చేయడం దారుణమని చంద్రబాబు అన్నారు. ప్రజలకు సంపద సృష్టించే ప్రాజెక్టును ఎందుకు పక్కనపెట్టారని ఆయన ప్రశ్నించారు. పోరాటంలో పాల్గొన్న ఆడబిడ్డలను ఎన్నో అవమానాలకు గురిచేసి అణగదొక్కే ప్రయత్నం చేశారని ఆక్షేపించారు. వార్తలు రాసిన మీడియా ప్రతినిధులపైనా నిర్భయ, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారని ధ్వజమెత్తారు. ఎన్ని కుట్రలు పన్నినా ప్రతి ఒక్కరూ ధైర్యంగా పోరాడుతున్నారని కొనియాడారు.

పనులు పూర్తి చేసి ఉంటే రూపం వచ్చేది

అభివృద్ధి కావాల్సిన కర్నూలును కరోనా బారిన పడేశారని చంద్రబాబు విమర్శించారు. విశాఖలో భూదోపిడీలకు పాల్పడ్డారని ఆరోపించారు. అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు నిర్మాణాలు ఇప్పటికే పూర్తయ్యాయన్న ఆయన... ఉద్యోగులు, జడ్జిల క్వార్టర్లు, మంత్రులు, ఎమ్మెల్యేల నివాసాలు 70శాతం పూర్తయ్యాయని గుర్తు చేశారు. ఆల్ ఇండియా సర్వీసెస్ ఉద్యోగుల నివాసాలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ 72శాతం పూర్తయ్యాయన్నారు. వీటితోపాటుగా జ్యుడీషియల్ కాంప్లెక్స్, హైకోర్టు, సచివాలయ నిర్మాణ పనులు కూడా 65శాతం పూర్తయినట్లు వెల్లడించారు. ఈ ఏడాది కాలంలో మిగిలినవి కూడా పూర్తి చేసి ఉంటే అమరావతి ఒక రూపానికి వచ్చేదని తెలిపారు.

ఎన్నో రకాల అవమానాలను ఎదుర్కొని, వీరోచితంగా పోరాడుతున్న అందరికీ చంద్రబాబు అభినందనలు తెలిపారు. ప్రభుత్వం మూడు రాజధానుల ప్రకటన విరమించుకుని అమరావతినే రాజధానిగా కొనసాగించే వరకూ పోరాటం కొనసాగుతుందని చంద్రబాబు తేల్చి చెప్పారు.

అమరావతిపై మోదీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి: చంద్రబాబు

ఇదీ చదవండి:

ప్రత్యేక జెండా.. ఒకటే ఎజెండా.. 200 రోజులుగా రెప్పవాల్చని పోరు

ABOUT THE AUTHOR

...view details