తెలుగుదేశం సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్రను పార్టీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. సంగం డెయిరీ కేసులో ఇటీవల జైలుకు వెళ్లి వచ్చిన నరేంద్రకు ధైర్యం చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా చింతలపూడిలోని ఆయన స్వగృహానికి వచ్చిన చంద్రబాబు.. పార్టీ అన్నివిధాల అండగా ఉంటుందని అభయమిచ్చారు. రాజకీయ కక్షసాధింపు కోసమే ఆయన్ను అరెస్టు చేశారని చంద్రబాబు అన్నారు. సంగం డెయిరీ.. కంపెనీ చట్టంలోకి చట్టప్రకారమే వెళ్లిందని స్పష్టం చేశారు.
"ధూళిపాళ్ల నరేంద్రకు తెదేపా పూర్తిగా అండగా ఉంటుంది. ఆయనకు ప్రజలు కూడా అండగా నిలవాలి. పోలీసులు చట్టాన్ని ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు తప్పవు. తెదేపా నాయకులను తప్పుడు కేసులతో వేధిస్తున్నారు. వైకాపా అవినీతి నుంచి దృష్టి మరల్చేందుకే తప్పుడు కేసులు పెడుతున్నారు. వైకాపా నేతల అవినీతిపై కేసులు పెడితే విచారణకు కోర్టులు చాలవు. వైకాపా ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి. అన్నీ గుర్తు పెట్టుకుంటాం. రాజద్రోహం కేసులో ఏపీ ప్రభుత్వం తీరును సుప్రీంకోర్టు తప్పుబట్టింది."