తెలంగాణ

telangana

ETV Bharat / city

వివేకా హత్య రక్తపు మరకలు తెదేపాకు అంటించాలని చూశారు: చంద్రబాబు - chandrababu naidu reacted on ys viveka murder case issue

ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని రావణకాష్టం చేసిన జగన్​రెడ్డి ప్రతి ఒక్కరినీ బెదిరిస్తున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. విచారణ సంస్థల్ని సైతం బెదిరించే స్థాయిలో వివేకా హత్య కేసు ముద్దాయిలు ఉన్నారని ఆరోపించారు.

chandrababu
chandrababu

By

Published : Feb 24, 2022, 10:42 PM IST

ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని రావణకాష్టం చేసిన జగన్ రెడ్డి ప్రతి ఒక్కరినీ బెదిరిస్తున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. విచారణ సంస్థల్ని సైతం బెదిరించే స్థాయిలో వివేకా హత్య కేసు ముద్దాయిలు ఉన్నారని ఆరోపించారు. ముద్దాయే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీపై కేసులు పెట్టారంటే ఎంతగా బరితెగించారో అర్ధం అవుతోందని ధ్వజమెత్తారు. ఏపీలో వ్యవస్థలను నాశనం చేశారని ఆక్షేపించారు. సొంత బాబాయిని హత్య చేయించిన వాళ్లకే జగన్ అండగా ఉంటున్నారని విమర్శించారు. వివేకా హత్య రక్తపు మరకలు తెదేపాకి అంటించాలని చూశారని ఆగ్రహం వ్యక్తం చేసారు. సీబీఐ ఎంక్వైరీ కావాలని ఇద్దరు చెల్లెళ్లను పక్కన పెట్టుకుని డిమాండ్ చేస్తే.. ఆ ఇద్దరిలో ఒకరైన జగనన్న బాణం తెలంగాణలో తిరుగుతోందని పేర్కొన్నారు. వైఎస్ అవినాష్ రెడ్డే వివేకా హత్యను దాచిపెట్టే ప్రయత్నం చేశారని స్వయంగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సీఐ శంకరయ్య సీబీఐకు వాంగ్మూలం ఇచ్చారని గుర్తుచేశారు. వైఎస్ వివేకా హత్య విషయంలో సీఎం జగన్ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు.

పంచాయతీల్లో వాలంటీర్ల పెత్తనమేంటి?:చంద్రబాబునాయుడు

గ్రామ సచివాలయాలు అంటే జగన్ రెడ్డి ఆఫీసులు కాదని తెలుగుదేశం అధినేత చంద్రబాబు హెచ్చరించారు. పంచాయతీల్లో వాలంటీర్ల పెత్తనమేంటని ప్రశ్నించారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో సర్పంచ్‌లతో సదస్సు నిర్వహించిన ఆయన.. వాలంటీర్లు అజమాయిషీ చేస్తే సహించవద్దని సూచించారు. ముఖ్యమంత్రికి ఉన్న అధికారాలే సర్పంచ్‌కు కూడా ఉంటాయనే విషయం గుర్తించాలన్నారు. 14, 15వ ఆర్థిక సంఘం పంచాయతీలకు ఇచ్చిన నిధులను ప్రభుత్వం మళ్లించడం దారుణమన్న చంద్రబాబు.. ఈ అంశంపై పోరాడాలని సర్పంచ్‌లకు పిలుపునిచ్చారు. ఈ పోరాటంలో తెలుగుదేశం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. చెత్త పన్ను వసూలు చేయబోమంటూ గ్రామ పంచాయతీల్లో తీర్మానం చేయాలని తెలుగుదేశం సర్పంచులకు దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల విషయంలో ప్రభుత్వ తీరును తప్పుపడుతూ దిల్లీ స్థాయిలో పోరాటానికి తెదేపా ప్రణాళికలు సిద్దం చేస్తోందన్నారు. రాజ్యాంగం కల్పించిన పంచాయతీ రాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేశారని చంద్రబాబు మండిపడ్డారు. ఆర్థిక సంఘం నిధులు మళ్లించటానికి ఈ ముఖ్యమంత్రి ఎవరు అని ప్రశ్నించారు. ప్రభుత్వం చేసిన ఎన్నో అరాచకాలపై పోరాడి గెలిచిన సర్పంచ్ లు నిజమైన హీరోలని కొనియాడారు.

హిందువుల మనోభావాలను దెబ్బతిస్తున్నారు..

తిరుమల వెంకన్నను అపవిత్రం చేస్తూ హిందువుల మనోభావాలను దెబ్బ తీస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరిస్తూ సేవా టిక్కెట్ల ధరలు పెంచేశారని మండిపడ్డారు. భక్తులను వెంకన్నకు దూరం చేస్తూ, వెంకన్న శక్తిని తగ్గించాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. వెంకటేశ్వరస్వామి జోలికొచ్చిన వారికి చరిత్ర ఉండదని హెచ్చరించారు. స్వామి తనను తాను కాపాడుకోగలరన్న చంద్రబాబు అంతా ఆయన రక్షకులుగా నిలవాలని సూచించారు.

పోలవరం ప్రాజెక్టును... బ్యారేజీగా మార్చే ప్రయత్నం..

పోలవరం ప్రాజెక్టును కాస్త బ్యారేజీగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. పోలవరాన్ని 45.72 అడుగుల మేర నిర్మించాలి...అప్పుడే నదుల అనుసంధానానికి వీలు ఉంటుందని స్పష్టం చేసారు. పోలవరాన్ని 45.72 అడుగుల మేర నిర్మాణం చేయగలిగితేనే రాయలసీమకు నీటిని అందివ్వగలమని పేర్కొన్నారు. ఇప్పుడు పోలవరం ఎత్తు తగ్గిస్తామంటున్నారని మండిపడ్డారు. పోలవరం నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో జగన్ ప్రభుత్వం ఉందని విమర్శించారు. వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామన్నారు.. మూడేళ్లైనా అతీగతీ లేదని ఎద్దేవా చేసారు.

ఇదీచూడండి:దిగొచ్చిన ఏపీ ప్రభుత్వం.. చర్చలకు ఆహ్వానం

ABOUT THE AUTHOR

...view details