తెలంగాణ

telangana

ETV Bharat / city

Chandrababu Kuppam Tour: 'కుప్పం వదిలే ప్రసక్తే లేదు... ఇక్కడి నుంచే పోటీ చేస్తా' - cbn latest news

Chandrababu Kuppam Tour: మూడు రోజుల పర్యటనలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు కుప్పం చేరుకున్నారు. పార్టీ శ్రేణులు అధినేతకు ఘనస్వాగతం పలికాయి. ఏపీ చిత్తూరు జిల్లా దేవరాజుపురంలో నిర్వహించిన రోడ్‌ షోలో బాబు పాల్గొన్నారు. నియోజకవర్గం మార్పుపై వస్తున్న ఊహాగానాలు ఆయన కొట్టిపారేశారు.

Chandrababu
Chandrababu

By

Published : Jan 6, 2022, 10:52 PM IST

Chandrababu Kuppam Tour: ప్రజాసమస్యలు నేరుగా తెలుసుకునేందుకే కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నానని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. తాను కుప్పం వదిలిపెడతానని దుష్ప్రచారం చేస్తున్నారన్న బాబు.. ఈ నియోజకవర్గాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో కుప్పం నుంచే పోటీ చేస్తానని చంద్రబాబు పునరుద్ఘాటించారు. మూడు రోజుల పర్యటన కోసం చంద్రబాబు కుప్పం వచ్చారు. ఈరోజు ఉదయం విమానంలో అమరావతి నుంచి బెంగళూరు చేరుకుని అక్కడినుంచి రోడ్డు మార్గంలో కుప్పం చేరుకున్నారు. బెంగళూరు విమానాశ్రయంలో చంద్రబాబుకు ఘన స్వాగతం లభించింది. కర్ణాటకలో స్థిరపడిన తెలుగువారు పెద్ద ఎత్తున తరలివచ్చి తెదేపా అధినేతకు స్వాగతం పలికారు.

ఏపీ చిత్తూరు జిల్లా దేవరాజుపురంలో నిర్వహించిన రోడ్‌ షోలో పాల్గొన్న బాబు.. నేతలు మారినా కార్యకర్తలు పార్టీ వెంటే ఉన్నారని గుర్తు చేశారు. కార్యకర్త ఒంటిపై పడే దెబ్బ తనకు తగిలినట్లుగా భావిస్తానన్న అధినేత.. అధికార పార్టీ ఇబ్బందిపెడితే 20 రెట్లు ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు.

'వైకాపా దోపిడీకి అడ్డుపడతానని నన్ను లక్ష్యంగా చేసుకొన్నారు. తెదేపా కార్యకర్తలపైనా కేసులు పెడుతున్నారు. దేవరాజుపురంలో తెదేపా జెండా దిమ్మెను తొలగించారు. క్యాడర్‌ను ఇబ్బంది పెట్టే ఏ ఒక్కరినీ వదిలిపెట్టను. మనమంతా ఏకమైతే పోలీసులు ఏం చేయగలరు. 3 నెలలకోసారి కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తా. కుప్పంలో కార్యకర్తల ఇష్ట ప్రకారమే నిర్ణయాలు తీసుకుంటాను'

-- చంద్రబాబు, తెదేపా అధినేత

రచ్చబండ కార్యక్రమంలో..

అరిమానుపెంట రచ్చబండ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. సీఎం జగన్​.. ఏ పనీ చేయకుండా వ్యవస్థలను నాశనం చేశారని ఆరోపించారు. ఉద్యోగులకు డీఏ, పీఆర్సీ ఊసే లేదని అన్నారు. రాష్ట్రంలో 60 ఏళ్లలో రూ.3.5 లక్షల కోట్ల అప్పులు చేస్తే.. జగన్‌ 2.5 ఏళ్లలో రూ.4 లక్షల కోట్ల అప్పు చేశారని విమర్శించారు.

అమరావతిని రక్షించండి.. అభివృద్ధి చేయండి: చంద్రబాబు

రామకుప్పం మండలం వీర్నమల సభలో చంద్రబాబు పాల్గొన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టును ప్రభుత్వం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. 'అమరావతిని రక్షించండి.. అభివృద్ధి చేయండి' అని నినదించారు. వైకాపా నేతల ఒత్తిడితోనే తెదేపా కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని... తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

ఇవాళ రాత్రికి కుప్పం ఆర్అండ్​బీ అతిథి గృహంలో చంద్రబాబు బస చేస్తారు. 7న కుప్పం మండలంలోని పలు గ్రామాలు, 8న రామకుప్పం మండలంలోని గ్రామాల్లో చంద్రబాబు పర్యటిస్తారు. రామకుప్పం మండలంలోని అరిమానపంట, వీర్నమలతండ, వీర్నమల, గుట్టూరుతండ, రామాపురం తండ, ననియాల, నారాయణపురం తండా, సింగసముద్రం, కంచెనబల్ల గ్రామాల మీదుగా పర్యటన కొనసాగనుంది.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details