రాష్ట్ర నీటి హక్కుల్ని కాపాడాల్సిన బాధ్యత ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డిపై ఉందని తెదేపా అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. బచావత్ ట్రైబ్యునల్ కేటాయించిన నీటి హక్కులు, విభజన చట్టం11వ షెడ్యూల్ హక్కులు, కేంద్రం 2015లో జారీ చేసిన జీవో నెంబర్ 69, ఉభయ రాష్ట్రాలు చేసుకున్న ఒప్పందాలను ముఖ్యమంత్రి కాపాడి తీరాలన్నారు.
చిత్తూరు జిల్లా పర్యటన ముగించుకుని సోమవారం సాయంత్రం అమరావతి చేరుకున్న చంద్రబాబు.. పార్టీ ముఖ్య నేతలతో ఆన్లైన్ సమావేశం నిర్వహించి, పలు తీర్మానాలను ఆమోదించారు. నదుల అనుసంధానమే అన్ని నీటి సమస్యలకు పరిష్కారమని తెలిసి కూడా.. తగు రీతిలో నిధులు ఖర్చు చేయకపోవటాన్ని చంద్రబాబు ఖండించారు. లెక్కల్లో చూపని రూ.41 వేల కోట్లపై కేంద్ర ఆర్థిక శాఖ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఏపీ హైకోర్టు ఆదేశాల ప్రకారం వెంటనే నరేగా నిధులు పెండింగ్ బకాయిలు చెల్లించాలన్నారు.
నేడు ఏపీ వ్యాప్తంగా నిరసనలు..
మైనింగ్ మాఫియాను వ్యతిరేకిస్తున్న గిరిజనుల్ని.. పోలీసులు బెదిరించడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు.ఇవాళ.. అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద తెదేపా శ్రేణులు బాధితులతో కలిసి నిరసనలు నిర్వహించి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని చంద్రబాబు నేతలకు సూచించారు. చట్ట ప్రకారం తగు అనుమతులు లేకుండా మైనింగ్‌కు అనుమతులు ఇవ్వటంతో పాటు రహదారి ఏర్పాటు, మైనింగ్ మాఫియాలో పెద్దల పాత్ర రిజువైందని మండిపడ్డారు.