CBN fires on Jagan: ఆంధ్రప్రదేశ్లో భీమిలి పర్యటనలో ప్రజలు 'జై బాబు' అన్న నినాదాలను 'జై జగన్' అన్నట్లుగా మార్ఫింగ్ చేసి ప్రచారం చేశారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. వైకాపా మొదటి నుంచి మళ్లింపు రాజకీయాలనే తన విధానంగా పెట్టుకుందన్న ఆయన.. తన పర్యటనలకు వస్తున్న అనూహ్య స్పందనను చూసి తట్టుకోలేకే కొత్త డ్రామాలు మొదలుపెట్టారని విమర్శించారు. పార్టీ ముఖ్య నేతలు, క్షేత్రస్థాయి నేతలతో ఆన్లైన్ సమావేశం నిర్వహించిన చంద్రబాబు.. జగన్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు విసిగిపోయారని దుయ్యబట్టారు.
2024లో ఓడిపోతే వైకాపా అనేది ఉండదనే విషయం జగన్‌కు అర్థమైందని చంద్రబాబు అన్నారు. జగన్ పోకడలను చూస్తే వచ్చే ఎన్నికలే వైకాపాకు చివరి ఎన్నికలు కానున్నట్లు స్పష్టమవుతోందన్నారు. తెదేపా నిర్వహిస్తున్న 'బాదుడే బాదుడు', సభ్యత్వ నమోదుపై సమీక్షించిన చంద్రబాబు.. గ్రామ స్థాయి నుంచి పార్టీలో చేరికలను ఆహ్వానించాలని నేతలకు సూచించారు. పులివెందులలో ఎస్సీ కాలనీలో తాగునీరు ఇవ్వలేని ఘటన అక్కడి పరిస్థితికి అద్దం పడుతోందని విమర్శించారు.
"జగన్ పాలనతో అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా విసిగిపోయారు. 2024లో ఓడిపోతే వైకాపా అనేది ఉండదని జగన్‌కు అర్థమైంది. జగన్ సింహం కాదు పిల్లి... భయంతో అందరి కాళ్లు పట్టుకుంటున్నారు. గ్రామ స్థాయి నుంచి పార్టీలో చేరికలను ఆహ్వానించండి. భీమిలి పర్యటనలో ప్రజలు జై బాబు అని నినాదాలు చేశారు. జై జగన్ అన్నట్లు మార్ఫింగ్ చేసి దుష్ప్రచారం చేశారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని ఓడించడానికి ప్రజలంతా కలిసి రావాలి అన్నాను. నా వ్యాఖ్యలను పొత్తులపై మాట్లాడినట్లు వక్రీకరించారు." -చంద్రబాబు, తెదేపా అధినేత