తెలంగాణ

telangana

By

Published : Dec 7, 2020, 4:03 PM IST

ETV Bharat / city

'పెళ్లి వేడుకలకిచ్చిన ప్రాధాన్యత ప్రజారోగ్యానికివ్వలేదు'

ఏలూరులో వింత వ్యాధి ఘటనపై క్షేత్రస్థాయిలో మూలాలు తెలుసుకునే ప్రయత్నం చేయకుండా ఏపీ సీఎం జగన్ పెళ్లి వేడుకకే ప్రాధాన్యం ఇచ్చారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమేనన్న ఆయన... నూటికి నూరు శాతం నీటి కాలుష్యం, పారిశుద్ధ్య లోపంతోనే ఏలూరు ఘటన చోటు చేసుకుందని స్పష్టం చేశారు. గత కొంతకాలంగా ఔట్ సోర్సింగ్ పారిశుద్ధ్య సిబ్బందికి చెల్లింపులు చేయకపోవటం కూడా ఓ కారణమని ఆరోపించారు. డిమాండ్ల పరిష్కారం కోసం రైతులు చేస్తున్న ఆందోళనలకు మద్దతుగా రేపు తెదేపా నేతలు ప్రభుత్వ కార్యాలయాల్లో వినతిపత్రాలు ఇవ్వనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు.

chandra babu
chandra babu

ఏపీలో వాటర్ గ్రిడ్​తో పాటు అనేక వ్యవస్థల్ని నిర్వీర్యం చేయటం వల్లే ఏలూరు వింత వ్యాధి ఘటనలు జరుగుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. తెలుగుదేశంపై దాడి, అక్రమ కేసుల బనాయింపు, పెళ్లి వేడుకులకు హాజరయ్యేందుకు చూపిస్తున్న శ్రద్ధ.. ప్రజారోగ్యం పట్ల సీఎం జగన్​కు లేదని మండిపడ్డారు. ఏలూరు వెళ్లిన సీఎం... ప్రజలకు నమ్మకం కలిగించేలా వ్యవహరించటంలో విఫలమయ్యారని విమర్శించారు. ఆరోగ్య శాఖ మంత్రి నియోజకవర్గంలోనే ప్రజలకు ఇలాంటి అనుభవాలు ఎదురైతే ఇతర ప్రాంతాల పరిస్థితి ఏంటని..? నిలదీశారు. వ్యాధికి కారణాలు తెలియవని వితండవాదం చేయటం సరికాదని హెచ్చరించారు. కరోనా సమయంలో బ్లీచింగ్ పౌడర్ స్థానంలో సున్నం చల్లిన ఘటనను ప్రస్తావించిన చంద్రబాబు... దానిపై వేసిన విజిలెన్స్ విచారణ నివేదిక ఏమైందని ప్రభుత్వాన్ని నిలదీశారు.

'సీఎం ఏలూరు పర్యటనలో పెళ్లి వేడుకకే ప్రాధాన్యం ఇచ్చారు'

చిత్తశుద్ధితో వ్యవహరించండి...

ముఖ్యమంత్రికి అప్పులు చేయటం, ఆస్తులు అమ్మటం, పన్నులు వసూలు చేయటంపై ఉన్న ధ్యాస ప్రజా సమస్యలపై లేదని చంద్రబాబు మండిపడ్డారు. గత కొంతకాలంగా ఔట్ సోర్సింగ్ పారిశుద్ధ్య సిబ్బందికి నిధులు చెల్లించకపోవటం కూడా ఏలూరు వింత వ్యాధి ఘటనకు ఓ కారణమని ఆరోపించారు. ఏలూరులో పరిస్థితి దారుణంగా ఉంటే ఎందుకు హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించలేదని నిలదీశారు. ఇకనైనా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ప్రజారోగ్యం కాపాడేందుకు చిత్తశుద్ధితో వ్యవహరించాలని హితవు పలికారు. వ్యవస్థలు సక్రమంగా అమలైతే ఇలాంటి ఘటనలు పునరావృతం కావని స్పష్టం చేశారు.

రైతుల ఆందోళనలకు మద్దతు...

డిమాండ్ల పరిష్కారం కోసం దేశవ్యాప్తంగా రైతులు చేస్తున్న ఆందోళనలకు తెలుగుదేశం మద్దతు ఉంటుందని చంద్రబాబు ప్రకటించారు. రేపు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో రైతుల డిమాండ్ల పరిష్కారం కోసం తెదేపా నేతలు వినతి పత్రాలు అందజేస్తారని తెలిపారు. కనీస మద్దతు ధరపై చట్టం చేయాలని స్పష్టం చేశారు. ప్రజాసమస్యల పట్ల ముఖ్యమంత్రికి ఉన్న అవగాహనరాహిత్యం పంటల బీమా చెల్లింపులో బయటపడిందని విమర్శించారు. సకాలంలో బీమా ప్రీమియం చెల్లించకపోవటం వల్ల రాష్ట్రంలో 30లక్షల మంది రైతులు నష్టపోయారని దుయ్యబట్టారు.

అమరావతి రైతులపై రాళ్లదాడిని తెలుగుదేశం అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, బొండా ఉమా, కొల్లు రవీంద్రతో పాటు గద్దె అనురాధలతో ఓ ప్రత్యేక బృందాన్ని రాజధాని ప్రాంతంలో పర్యటించాలని ఆదేశించారు.

'సీఎం ఏలూరు పర్యటనలో పెళ్లి వేడుకకే ప్రాధాన్యం ఇచ్చారు'

ఇదీ చదవండి :ఏలూరులో పెరుగుతున్న బాధితులు.. మరో 27 మందికి అస్వస్థత

ABOUT THE AUTHOR

...view details