CHANDRABABU FIRES ON JAGAN: ప్రజాసమస్యల కోసం పోరాడే పార్టీ మాది.. కేసులకు భయపడే ప్రసక్తే లేదు.. ప్రభుత్వం పెడుతోన్న తప్పుడు కేసులు తమనేమీ చేయలేవని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లా జైలులో ఉన్న తెదేపా నేతల్ని పరామర్శించిన అనంతరం మాట్లాడిన చంద్రబాబు.. సీఎం జగన్ నేర చరిత్రపై పోరాటం చేస్తామన్నారు. చట్టవిరుద్ధంగా పని చేస్తున్న పోలీసు అధికారుల్ని వదిలిపెట్టబోమని హెచ్చరించారు.
కుప్పం అన్న క్యాంటీన్ ఘటనలో 72 తెదేపా నేతలపై కేసు పెట్టారని.. మరికొందరిపై హత్యాయత్నం కేసులు పెట్టారన్నారు. తెదేపా నేతలపై వివిధ సెక్షన్ల కింద పెట్టిన కేసులు దారుణమని మండిపడ్డారు. మీరు దాడులు చేసి.. తిరిగి మా నేతలపై కేసులు పెట్టారని.. సమావేశం పెట్టినప్పుడు ప్రజలు రారా అని ప్రశ్నించారు.
తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ జైలుకెళ్లి ఎవరినీ పరామర్శించలేదని.. మొదటిసారి చిత్తూరు జైలులో ఉన్న 8 మంది కార్యకర్తలను పరామర్శించానని చంద్రబాబు తెలిపారు. జగన్‌ను తరిమికొట్టే రోజు వస్తుందని తేల్చిచెప్పారు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లోనే కాదు.. పులివెందులలోనూ గెలుస్తామని సవాల్ విసిరారు. పోలవరం, అమరావతిపై అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్పారన్నారు. తెదేపా సంపదను సృష్టిస్తే.. వైకాపా విధ్వంసం చేస్తోందని.. విధ్వంసాన్ని అడ్డుకుంటే తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.