వైకాపా నేతలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లోని సత్యవేడు పట్టణంలో ఉప ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. బహిరంగ సభ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిపివేయటంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్న రాళ్లదాడి చేశారని.. ఇవాళ కరెంట్ నిలిపారని ఆక్షేపించారు. తాను వెళ్లేచోట కరెంటు కట్ చేయాలని ఆదేశాలు ఇచ్చారని చంద్రబాబు ఆరోపించారు. సభలో రాళ్లు వేస్తే దానికి తానే ఆధారాలు ఇవ్వాలని చెప్పడమేంటని ప్రశ్నించారు.
వైకాపా రెండేళ్ల పాలనలో అభివృద్ధి ఏమైనాా జరిగిందా? అని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కోసం ఎంపీలను గెలిపించాలని కోరారని.. కానీ ఇవాళ జగన్ తన కేసుల కోసం ఎంపీలను అమ్ముకున్నారని దుయ్యబట్టారు. నాసిరకం మద్యం బ్రాండ్లు అమ్మి ప్రజాధనాన్ని దండుకొంటున్నారని విమర్శించారు. తన పోరాటం పదవి కోసం కాదని.. రాష్ట్ర భవిష్యత్తు కోసమని స్పష్టం చేశారు.
నాడు సమైక్యాంధ్ర అభివృద్ధికి విజన్ 2020 రూపొందించా.. నవ్యాంధ్ర అభివృద్ధికి విజన్ 2029 తయారుచేశా. శ్రీసిటీలోని 180 పరిశ్రమల్లో 90 మా పాలనలోనే వచ్చాయి. రూ.4 వేల కోట్లతో హీరో మోటార్స్ తీసుకువచ్చాం. మోటార్లకు మీటర్లు పెట్టి రైతుల మెడకు ఉరితాళ్లు వేస్తున్నారు. రైతు కూలీల పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారైంది. నిత్యావసరాల ధరలు పెరిగాయి, పెట్రోల్ ధరలు పెంచారు. మన రాష్ట్ర ఆదాయం పక్క రాష్ట్రాలకు తరలిపోతోంది. మూర్ఖపు ముఖ్యమంత్రితో రాష్ట్రం నాశనమవుతోంది. కరోనా వైరస్ కంటే జగన్ వైరస్ భయంకరమైంది. కరోనాకు వ్యాక్సిన్ ఉంది.. జగన్ వైరస్‌కు వ్యాక్సిన్ లేదు. రాష్ట్రాన్ని కాపాడుకునే అవకాశం తిరుపతి ప్రజలకు వచ్చింది. - చంద్రబాబు, తెదేపా అధినేత