CHANDRABABU: ఏపీలోని గుంటూరు జిల్లా గుండ్లపాడులో దారుణహత్యకు గురైన చంద్రయ్య మృతదేహానికి తెదేపా అధినేత చంద్రబాబునాయుడు నివాళులర్పించారు. చంద్రయ్య పాడె మోసి, అంత్యక్రియల్లో పాల్గొన్నారు. మృతుని కుటుంబసభ్యులను పరామర్శించారు. పార్టీ తరఫున చంద్రయ్య కుటుంబానికి అండగా ఉంటామని చంద్రబాబు భరోసా ఇచ్చారు.
పిన్నెల్లి సామ్రాజ్యంలో ప్రజాస్వామ్య స్థాపనకు వచ్చానని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. చంద్రయ్యను చంపిన వారికి శిక్షపడాలని డిమాండ్ చేశారు. తప్పుడు పనులు చేయాలంటే భయపడేలా వైకాపా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చంద్రబాబు అన్నారు. ఒక్క చంద్రయ్యను చంపితే.. వందమంది తయారవుతారని తెదేపా అధినేత స్పష్టం చేశారు. చంద్రయ్య హత్యపై సీఎం జగన్ జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు.
చంద్రయ్యను నడిరోడ్డుపై కిరాతకంగా హత్య చేశారు. అధికారం, పదవులు ఎవరికీ శాశ్వతం కాదు. మనందరి ప్రాణాలూ ఒకటేనని తెలుసుకోవాలి. రౌడీలందరూ జాగ్రత్తగా ఉండాలి. పల్నాడులోని ముఠాలను అణచివేశాను. పిన్నెల్లి రామకృష్ణారెడ్డీ.. నీలాంటి వారిని చాలామందిని చూశాను. మాచర్ల మీ జాగీరు కాదు, ఖబడ్దార్. మా నేతలపై దాడి చేసిన రౌడీకి మున్సిపల్ ఛైర్మన్ ఇస్తావా?.
- చంద్రబాబు, తెదేపా అధినేత