స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగువారి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పారని తెదేపా అధినేత చంద్రబాబు కొనియాడారు. తెలుగుజాతి ఉన్నంత వరకు ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ ఉంటారన్నారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన పార్టీ 40వ ఆవిర్భావ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా మాట్లాడిన ఆయన.. తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల గుండె చప్పుడు అని అన్నారు. ప్రతి ఒక్కరి రక్తంలో తెలుగుదేశం పార్టీ ఉందని.., ప్రజల నరనరాల్లో తెదేపా జీర్ణించుకుపోయిందన్నారు.
21 ఏళ్లు అధికారంలో, 19 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నా.. తమది ప్రజాపక్షమేనని చెప్పారు. నవతరానికి నాంది పలికిన గొప్పవ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. పటేల్-పట్వారీ వ్యవస్థను రద్దు చేసి మహిళలకు ఆస్తిలో సమాన హక్కులు తీసుకువచ్చిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందన్నారు. మహిళలకు రిజర్వేషన్లు వచ్చాక రాజకీయాల్లోకి వస్తున్నారన్నారు. వెనకబడిన వర్గాలకు తమ పార్టీ ప్రాతినిధ్యం ఇచ్చిందని గుర్తు చేశారు. యువతను ప్రోత్సహించాలని తెదేపా నిర్ణయం తీసుకుందని.., వచ్చే ఎన్నికల్లో యువతకు 40 శాతం సీట్లు కేటాయిస్తామని చెప్పారు.
"గ్రామ కమిటీ నుంచి ప్రతి ఒక్క కార్యకర్త వేడుకలు చేస్తున్నారు. ప్రపంచ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా పార్టీ ఆవిర్భావ వేడుకలు. 40 దేశాల్లో 200 నగరాల్లో తెదేపా ఆవిర్భావ వేడుకలు. 40 ఏళ్లుగా పార్టీ కొనసాగడం అరుదైన అవకాశం. అధికారం కోసం ఎన్టీఆర్ పార్టీ ఏర్పాటు చేయలేదు. తెలుగువారి సంక్షేమమే తెదేపా పరమావధి. తెలుగుజాతికి పునరంకితం కావాల్సిన సమయం వచ్చింది."- చంద్రబాబు తెదేపా అధినేత
దూరదృష్టితో ఆలోచించాం: తెదేపా హయాంలోనే విజన్ 2020 తీసుకువచ్చానని చంద్రబాబు అన్నారు. తెదేపా దూరదృష్టితో నాలెడ్జ్ అకాడమీకి ప్రాధాన్యం ఇచ్చిందని తెలిపారు. బయోటెక్నాలజీకి ప్రాధాన్యం ఉందని ముందే గ్రహించామని చెప్పారు. తెదేపా హయాంలో జీనోమ్ వ్యాలీకి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. జీనోమ్ వ్యాలీ నుంచి కరోనా టీకా రావడం దేశానికి గర్వకారణమని అన్నారు. హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ కేంద్రం ఏర్పాటుకు కృషిచేశానని తెలిపారు. శంషాబాద్లో విమానాశ్రయం తీసుకువచ్చామని..,అభివృద్ధి ఎవరు చేసినా ముందుకు తీసుకెళ్లాలని అన్నారు.