ఏపీలోని పులివెందులలో హత్యకు గురైన ఎస్సీ మహిళ కేసులో దోషులను శిక్షించాలని ఆందోళన చేసిన తెదేపా నేతలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం దుర్మార్గమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. రాజకీయ కక్ష సాధింపుల కోసం ఎస్సీ, ఎస్టీలను రక్షించటానికి ఉన్న చట్టాలను వాడటం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టని దుయ్యబట్టారు. తక్షణమే కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
నిందితులను అరెస్టు చేయాలని అడగడం తప్పా... అని నిలదీశారు. ఏ నేరం చేశారని నిరసన కారులపై అట్రాసిటీ కేసులు పెట్టారని ప్రశ్నించారు. మనం రాచరికంలో ఉన్నామా, ప్రజాస్వామ్యంలో ఉన్నామా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఈ విధంగా అపహాస్యం చేస్తుంటే అమలవుతున్నది రాజారెడ్డి రాజ్యాంగం కాక మరేంటని ఆక్షేపించారు. పరిపాలన చేతకాకపోయినా ఏపీలో అక్రమ కేసులకు కొదవ లేదన్న చంద్రబాబు.. ప్రజాస్వామ్యానికి మాయని మచ్చగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానాలు ఉన్నాయని దుయ్యబట్టారు. శాంతియుత ప్రదర్శనలు, నిరసనలు జరిపే ప్రాథమిక హక్కు ఉన్న రాజకీయ పార్టీలు, ప్రజలపై నిరంకుశంగా వ్యవహరించి అక్రమ కేసులు పెట్టడం అప్రజాస్వామికం, రాజ్యాంగ వ్యతిరేకమని ధ్వజమెత్తారు.
ఫాసిస్టు పాలనకు నిదర్శనం
ప్రజల పక్షాన ప్రశ్నించడం నేరంగా, ప్రజా వ్యతిరేక చర్యలపై పోరాడటం ఘోరంగా, ప్రజల హక్కులు పరిరక్షణకు పూనుకోవడం ద్రోహంగా భావించి కేసులు బనాయించడం జగన్ రెడ్డి ఫాసిష్టు పాలనకు నిదర్శనమని విమర్శించారు. వైకాపా నాయకులు ఎస్సీ, ఎస్టీ, బీసీలను హతమార్చినా, శిరోముండనాలు చేసినా, దాడులు చేసినా కేసులుండవన్న చంద్రబాబు... న్యాయం కోసం పోరాడిన వారిపై మాత్రం అరక్షణంలో అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. జగన్ రెడ్డి ప్రభుత్వం ఈ విధానం మానుకోకుంటే ప్రజలు ఏమాత్రం క్షమించరని హెచ్చరించారు.