పోలవరం ప్రాజెక్టు పనులను గత ఏడాదిగా నిలిపివేశారని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. కాంట్రాక్ట్ రద్దు చేసి కావాల్సిన వాళ్లకు ఇచ్చారని ఆరోపించారు. సాగర్‌కు గోదావరి జలాలు ఇచ్చి, శ్రీశైలంలో పొదుపు జలాలు రాయలసీమకు ఇచ్చేలా ప్రణాళిక చేశామని వివరించారు. ఏపీ, తెలంగాణలో నీటిపారుదల ప్రాజెక్టులన్నీ ప్రారంభించింది తెదేపానేనని పేర్కొన్నారు. పంచనదుల అనుసంధానం ద్వారా నీటి కొరత లేకుండా చేయాలని చూశామని వెల్లడించారు.
పోతిరెడ్డిపాడు పనులను ప్రారంభించింది ఎన్టీఆర్ అని చంద్రబాబు గుర్తు చేశారు. జీవో 203 పేరుతో విద్వేషాలు పెంచుతున్నారని ఆక్షేపించారు. ముచ్చుమర్రి ద్వారా సీమకు నీళ్లిచ్చింది తెదేపానే అని చెప్పారు. దోచుకో-దాచుకో అనేదే వైకాపా లక్ష్యమని దుయ్యబట్టారు.