ఆంధ్రప్రదేశ్‌లో అన్ని రాజకీయ పార్టీలతో కలిసి ప్రజాస్వామ్య పరిరక్షణ పోరాటం చేస్తామని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. విజయవాడలోని నోవాటెల్ హోటల్‌లో పవన్ కల్యాణ్‌ను కలిసిన అనంతరం ఇద్దరూ సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ‘‘ఎయిర్‌పోర్టు నుంచి వస్తూ పవన్ ఇక్కడున్నారని తెలిసి నేరుగా వచ్చా. ముందుగా ఎవరికీ చెప్పలేదు. పవన్‌ను కలిసి సంఘీభావం తెలిపేందుకే వచ్చా. నాగరిక ప్రపంచంలో, ప్రజాస్వామ్యంలో విశాఖలో జరిగిన తీరు చూస్తే బాధేస్తోంది. పవన్ కల్యాణ్ విశాఖలో కార్యక్రమం పెట్టుకునేందుకు వెళ్తే పోలీసులు వ్యవహరించిన తీరు బాధాకరం. ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక ఉన్మాది పాలనలో పైశాచిక ఆనందం కోసం తప్పుడు పనులు చేసే పరిస్థితికి వచ్చారు’’
‘‘ఒక పోలీసు అధికారి వాహనం ఎక్కి నడిరోడ్డుపై పవన్‌ను నిలబెట్టే పరిస్థితి. దారిపొడవునా లైట్లు తీసి చీకట్లో పంపించారు. తప్పుడు కేసులు పెట్టి బెదిరించి.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. మూడున్నరేళ్లుగా దాడులు చేస్తూ కేసులు పెడుతున్నారు. వైకాపా వేధింపులు తాళలేక కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రజాస్వామ్యం లేకపోతే రాజకీయ పార్టీలకు ప్రాధాన్యత లేదు. రాజకీయ పార్టీలు లేకపోతే ప్రజా సమస్యలపై ఎవరు పోరాడతారు. నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో వైకాపా లాంటి నీచమైన పార్టీని ఎప్పుడూ చూడలేదు. జగన్ పైశాచిక ఆనందం శాశ్వతం కాదు’’
కలిసి రావాలని పవన్ కల్యాణ్‌ను కోరాం..:‘‘విశాఖ ఘటన నేపథ్యంలో మనసు బాధపడి తప్పకుండా పవన్‌ను కలిసి సంఘీభావం తెలపాలని ఇక్కడికి వచ్చా. తెదేపా కార్యాలయంపై దాడి చేసి మాపైనే కేసులు పెట్టారు. ఇంత కన్నా దారుణం ఇంకేమైనా ఉంటుందా? ముందు రాజకీయ పార్టీల మనుగడ కాపాడుకుందాం. ఆ తర్వాత ప్రజాసమస్యలపై పోరాడుదాం. అవసరమైతే అన్ని రాజకీయ పార్టీలను కలిసి చర్చిస్తాం. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం మా కర్తవ్యం. కొంతమంది పోలీసులు దారుణంగా వ్యవహరిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కలిసి రావాలని పవన్ కల్యాణ్‌ను కోరాం. బయటకు వచ్చి మాట్లాడే స్వేచ్ఛ ఎవరికైనా ఉందా? సమస్యలపై ధైర్యంగా చెప్పుకొనే పరిస్థితి ఎవరికీ లేదు’’ అని చంద్రబాబు అన్నారు.