తెలంగాణ

telangana

ETV Bharat / city

chandrababu on floods : 'ముందుచూపు లేక ప్రజలను ముంచేశారు..' - చంద్రబాబు వరదలు జగన్​ ప్రభుత్వం

chandrababu on Floods : ముందు చూపు లేకపోవడం వల్ల ఏపీ ప్రజలను ముంచేశారని వైకాపా ప్రభుత్వంపై తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. గోదావరికి వరదలు అనుకోకుండా వచ్చినవి కావని, కేంద్రం ముందే హెచ్చరించినా.. ఆ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. కనీసం వరద నివేదిక పంపే విషయంలో కూడా విఫలమైందని ఆరోపించారు.

chandrababu on floods
chandrababu on floods

By

Published : Jul 23, 2022, 12:25 PM IST

Chandrababu on Floods: ‘గోదావరికి ఈ వరదలు అనుకోకుండా వచ్చినవి కాదు. ఈనెల 12నే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించింది. వరద, విపత్తుల నిర్వహణ వ్యవస్థలను గాలికొదిలేయటంతో పాటు కేంద్రం హెచ్చరికల్నీ లెక్క చేయలేదు. ముందు చూపు లేక జనాన్ని ముంచేశారు. కేంద్రానికి వరద నష్ట నివేదిక పంపే విషయంలో కూడా ఈ ప్రభుత్వం విఫలమైంది’ అని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు.

శుక్రవారం రోజున ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు, యలమంచిలి మండలాల్లోని వరద ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. పలుచోట్ల బాధితుల ఇళ్లకు వెళ్లి పరామర్శించారు. వారి పక్షాన పోరాడతామని భరోసా ఇచ్చారు. లక్ష్మీపాలెంగ్రామంలో ఇంకా వరద నీరు పూర్తిగా తగ్గక వీధులన్నీ బురదమయంగా ఉన్నా చంద్రబాబు కాలినడకన వెళ్లి బాధితులను పరామర్శించారు. రెండురోజుల క్రితం వరకూ తాము వరద నీటిలోనే ఉండాల్సి వచ్చిందని స్థానికులు వివరించారు. ప్రభుత్వం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పర్యటన అనంతరం ఆయన పాలకొల్లులో విలేకరులతో మాట్లాడారు.

వరద నష్టాన్ని ప్రభుత్వం భరించాలి..‘‘రాష్ట్ర ప్రభుత్వం బాధితులకు రూ.2 వేలు ఇచ్చి చేతులు దులుపుకొంటే సరిపోదు. తెలంగాణ మాదిరిగా ఇక్కడా రూ.10 వేల చొప్పున సాయం చేయాలి. పూర్తిగా ఇళ్లు కోల్పోయిన వారికి రూ. 4 లక్షలతో మళ్లీ నిర్మించి ఇవ్వాలి. దెబ్బతిన్న ఇళ్లకు రూ.50 వేలు అందజేయాలి. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.10 లక్షలు పరిహారం చెల్లించాలి. దెబ్బతిన్న అరటి, తమలపాకు, వరికి ఎకరాకు రూ.40 వేలు, రూ.50 వేలు, రూ.25 వేల చొప్పున పరిహారం అందించాలి. ఆక్వాకు హెక్టారుకు రూ.50 వేల చొప్పున అందించాలి. పశువులకు రూ.40 వేల వంతున పరిహారం ఇవ్వాలి. తెదేపా ప్రభుత్వ హయాంలో ఆక్వా రంగాన్ని ఆదరించాం. రూ.2కే యూనిట్‌ విద్యుత్తు ఇస్తే వైకాపా ప్రభుత్వం రూ.1.5కి ఇస్తామని హామీ ఇచ్చి కొన్నిరోజులు అమలు చేసి ప్రస్తుతం యూనిట్‌ రూ.4 చేసి మోసం చేస్తోంది. తెదేపా మళ్లీ అధికారంలోకి రాగానే పాత ఛార్జీలను పునరుద్ధరిస్తాం. వరదల సమయంలో మత్స్యకారులు వేటకు వెళ్లరు కాబట్టి వారికి సాధారణ వరద బాధితుల కంటే రెట్టింపు సాయం చేసేవాళ్లం. ఇప్పుడు చాలామందికి 10 కిలోలు కూడా ఇవ్వని పరిస్థితులను గమనించా." అని చంద్రబాబు చెప్పారు.

పోలవరాన్ని గోదావరిలో వదిలేశారు.. "తెదేపా హయాంలో 72 శాతం పూర్తయిన పోలవరాన్ని రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో గోదావరిలో ముంచారు. 2020 జూన్‌ నాటికి పూర్తి కావాల్సిన ప్రాజెక్టును పూర్తి చేయలేని ఈ ప్రభుత్వమే వరదలకు కారణం. గుత్తేదారులను మార్చటం మంచిదికాదని పీపీఏ చెప్పినా పట్టించుకోలేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంల మధ్య నీరు చేరిపోయింది. పోలవరం నిర్వాసితులకు రూ.10 లక్షల పరిహారం ఇచ్చి ఇళ్లు కట్టించి పునరావాసం కల్పిస్తానని చెప్పిన జగన్‌రెడ్డి నేను కట్టిన ఇళ్లను కూడా పూర్తిచేయలేకపోయారు.ఉమ్మడి గోదావరి జిల్లాలో ధాన్యం విక్రయించిన రైతుల్లో చాలామందికి ఇప్పటి వరకూ బకాయిలు చెల్లించలేదు. దీంతో వారు వ్యవసాయం మానేస్తున్నారు. నష్టాలు భరించలేక కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దేశంలో పెట్రోలు, ఇసుక, మద్యం, విద్యుత్తు ఇలా అన్నింటి ధరల్లో మన రాష్ట్రమే ప్రథమ స్థానంలో ఉంది." అని బాబు తెలిపారు.

నాడు ఐదేళ్ల ఓదార్పు.. నేడేదీ? ..తెలంగాణలో మంత్రులు వరద ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు రూ.10 వేల చొప్పున పరిహారం ఇస్తున్నారు. బాధితుల పరామర్శకు మంత్రులను పంపించలేని ముఖ్యమంత్రి ఈయన. తండ్రి చావును అడ్డం పెట్టుకుని ఐదేళ్లు ఓదార్పు యాత్ర, పాదయాత్ర చేసిన వ్యక్తికి ఇప్పుడు గోదావరి వరదల్లో సర్వం కోల్పోయినవారిని ఓదార్చే బాధ్యత లేదా?’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు.

ABOUT THE AUTHOR

...view details