తెదేపా అధినేత చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనను అడ్డుకొనేందుకు అధికార పక్షం, పోలీసు యంత్రాంగం వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు స్పష్టమవుతోంది. బుధవారం ఉదయం నుంచి వరుసగా చోటుచేసుకున్న పరిణామాలు ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. విజయనగరం జిల్లాలో ప్రజాచైతన్య యాత్ర, పెందుర్తి మండలంలో భూ సమీకరణ బాధిత రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని తెదేపా నేతలు వారం క్రితమే ఖరారు చేశారు. జెడ్‌ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న చంద్రబాబు పర్యటన వివరాలను ముందస్తుగా కలెక్టరేట్, పోలీసు కమిషనరేట్‌లకు పంపారు. విమానాశ్రయం నుంచి పెందుర్తికి ర్యాలీగా వెళ్లేందుకు అనుమతుల కోసం పోలీసులను సంప్రదించారు. ఎట్టకేలకు బుధవారం రాత్రి షరతులతో కూడిన అనుమతి వచ్చింది.
భారీగా చేరుకున్న వైకాపా కార్యకర్తలు..
గురువారం ఉదయం విమానాశ్రయం వైపు వెళ్లే వాహనాలను తనిఖీ చేసిన పోలీసులు తెదేపా కార్యకర్తలను ఎక్కడికక్కడ ఆపేశారు. అదే సమయంలో వైకాపా కార్యకర్తలు విమానాశ్రయానికి భారీగా చేరుకున్నారు. పోలీసుల షరతుల మేరకు తెదేపా నేతలు కొద్దిసంఖ్యలో విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానంలో వచ్చిన చంద్రబాబు కారెక్కేసరికి వైకాపా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చుట్టుముట్టారు. అక్కడున్న కొద్దిపాటి పోలీసులు వారిని అడ్డుకోలేకపోయారు. ఒకదశలో చేతులెత్తేసి దూరంగా వెళ్లి నిలబడ్డారు.
పక్కా ప్రణాళిలక ప్రకారమే
చంద్రబాబు బయటకు వచ్చి కారులో కూర్చున్నాక కదలనీయకుండా దిగ్బంధించడం వెనుక అధికారపక్షం, పోలీసు యంత్రాంగం వ్యూహాత్మకంగా వ్యవహరించాయని తెదేపా నేతలు ఆరోపించారు. బయట ఉద్రిక్తంగా ఉన్న విషయాన్ని పోలీసులు ముందే చెబితే చంద్రబాబు లాంజ్‌లో ఉండేవారని, కావాలనే బయటకు రప్పించి ఇలా దిగ్బంధించారని తెదేపా శాసనసభ్యుడు అచ్చెన్నాయుడు అన్నారు. 'రెండు రోజుల ముందు నుంచే వైకాపా నేతలు చంద్రబాబు పర్యటనపై దృష్టి సారించారు. వైకాపా నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసేందుకు మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు... విశాఖ రహదారులు, భవనాల శాఖ అతిథి గృహంలో బస చేశారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి సైతం కార్యకర్తలను తీసుకొచ్చారు. రాయలసీమ జిల్లాల నుంచి కూడా కొంతమంది వచ్చారని' తెదేపా నాయకులు ఆరోపించారు.