Chandrababu On Chennupati Case: కన్ను పొడిచిన నిందితులకు స్టేషన్ బెయిల్ ఇచ్చి నినాదాలు చేసిన వారిపై హత్యాయత్నం కేసు పెట్టిన పోలీసులు మరోసారి తామేంటో .. తమ శాఖ తీరేంటో .. తాము ఎటువైపో స్పష్టంగా చెప్పారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. కుప్పంలో సాధారణ నిరసనలు చేపట్టిన వారిపై హత్యాయత్నం సెక్షన్ పెట్టి రిమాండ్కు పంపిన పోలీసులు.. విజయవాడలో దాడి చేసి కన్ను పోగొట్టిన నిందితులకు మాత్రం స్టేషన్ బెయిల్ ఇచ్చి ఇంటికి పంపడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.
ఈ రెండు ఘటనల్లో ఖాకీల తీరు పోలీసు శాఖ ప్రతిష్ఠకే మాయని మచ్చని చంద్రబాబు దుయ్యబట్టారు. ప్రభుత్వం కోసం పోలీసులు మరీ ఇంతగా సాగిలపడటాన్ని ప్రజలు ఎవరూ ఆమోదించరన్నారు. ఏపీ పోలీస్ అనే బ్రాండ్ సర్వనాశనం కావడానికి, ప్రజలకు పోలీసులపై నమ్మకం పోవడానికి ఈ ఘటనలే ఉదాహరణ అని మండిపడ్డారు. ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకునేది నిందితులను రక్షించేందుకు కాదని.. చట్టప్రకారం పని చేసేందుకనే విషయం గుర్తించాలని చంద్రబాబు హితవు పలికారు.
న్యాయసలహా తీసుకునే ఆ కేసు పెట్టలేదు: చెన్నుపాటి గాంధీ కేసుపై విజయవాడ సెంట్రల్ ఏసీపీ ఖాదర్ బాషా పొంతనలేని సమాధానం చెప్పారు. పటమట పోలీస్స్టేషన్ వద్ద తెదేపా నేతల ఆందోళన అనంతరం కేసుకు సంబంధించిన వివరాలను ఆయన మీడియాకు వివరించారు. బాధితుడి ఫిర్యాదుతో పాటు, ఆస్పత్రి ఇచ్చిన నివేదికలో మారణాయుధంతో దాడి జరిగిందని ఉన్నప్పటికీ.. న్యాయ సలహా తీసుకునే హత్యాయత్నం సెక్షన్ పెట్టలేదని అన్నారు.
ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రితో పాటు ప్రాథమిక చికిత్స చేసిన సూరపనేని ఆస్పత్రి కూడా కన్ను పోయే ప్రమాదం ఉందనే నివేదిక ఇచ్చిందని ఏసీపీ తెలిపారు. గాంధీకి శస్త్ర చికిత్సలు ఇంకా కొనసాగుతున్నందున తుది వైద్య నివేదికను కోర్టు ముందు పెట్టలేదన్నారు. తుది వైద్య నివేదిక వచ్చేవరకు సున్నితమైన అంశంలో నిందితుల్ని కోర్టు ముందు పెట్టకుండా ఉండలేమన్నారు. కేసు ఇంకా విచారణ దశలో ఉంది కాబట్టి.. ఇంతకంటే ఏం సమాధానం చెప్పలేమంటూనే... ఎఫ్ఐఆర్ ఆధారంగానే ముందుకెళ్తున్నామని ఖాదర్బాషా తెలిపారు.
ఉద్రిక్తత: విజయవాడ పటమట పోలీస్స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. తెలుగుదేశం నేతలు నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని ఒక్కసారిగా స్టేషన్ను చుట్టుముట్టారు. చెన్నుపాటి గాంధీపై హత్యాయత్నం జరిగితే.. పోలీసులు కేసును నీరుగార్చుతున్నారంటూ నేతలు ఆందోళన చేపట్టారు. చెన్నుపాటి గాంధీపై జరిగిన హత్యాయత్నంలో గాయం నివేదిక లేకుండా పోలీసులు కోర్టుకు రిమాండ్ రిపోర్టు సమర్పించిన తీరును నిరసిస్తూ ఆందోళన చేశారు.