Chandraiah murder in Guntur district: తెదేపా.. గ్రామ అధ్యక్షుడు చంద్రయ్య హత్యను ఆ పార్టీ అధినేత చంద్రబాబు, లోకేశ్ తీవ్రంగా ఖండించారు. ఇవాళ మధ్యాహ్నం చంద్రబాబు గుండ్లపాడుకు వెళ్లనున్నారు. చంద్రయ్య మృతదేహానికి నివాళులర్పించనున్నారు. బాధిత కుటుంబసభ్యులను పరామర్శించనున్నారు.
వెంటనే అరెస్ట్ చేయాలి : నారా లోకేశ్
చంద్రయ్య హత్యపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. జగన్ సీఎం అయ్యాక ప్రజలు, ప్రతిపక్షాలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. ప్రశ్నించేవారిపై దాడులు, పోరాడేవారిని అంతమొందించడం అలవాటైందని ఆరోపించారు. చంద్రయ్య హత్యను తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు. హత్యకు పాల్పడినవారిని వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. చంద్రయ్య కుటుంబానికి తెదేపా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
రాష్ట్రంలో జగన్ రెడ్డి.. పల్నాడులో పిన్నెలి..
చంద్రయ్యను దారుణంగా హత్య చేయడాన్ని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, పొలిట్ బ్యూరో సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో జగన్ రెడ్డి, పల్నాడులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హత్యా రాజకీయాల్ని పెంచి పోషిస్తున్నారని మండిపడ్డారు. వైకాపా అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పల్నాడులో అరాచకాలు, హత్య రాజకీయాలు ఎక్కువయ్యాయన్నారు. రెండున్నరేళ్ల కాలంలో అనేక మంది తెదేపా కార్యకర్తలను బలి తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక వైకాపా అరాచకాల్ని సహించం, ఇప్పటినుంచి రాష్ట్రంలో ఎక్కడైనా మరో తెదేపా కార్యకర్తపై చెయ్యేస్తే పరిణామాలు వేరేగా ఉంటాయని హెచ్చరించారు. చంద్రయ్య కుటుంబానికి 60 లక్షల తెదేపా కుటుంబ సభ్యులందరూ అండగా ఉంటారన్నారు. చంద్రయ్యను హత్య చేసిన వారిని, హత్య చేయించిన వారిని పోలీసులు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. హత్యా రాజకీయాల వారసుడు జగన్ రెడ్డి సీఎం అవ్వడంతో ప్రజలకు, ప్రతిపక్షాలకు రక్షణ లేకుండా పోయిందని ఆక్షేపించారు. ప్రశ్నించే వారిపై దాడులు, పోరాడే వారిని అంతమొందించడం అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. పాలనతో ప్రజల్ని మెప్పించలేక ప్రభుత్వాన్ని ఎండగడుతున్న వారిని చంపి.. ప్రతిపక్షం గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.