సీల్డ్ కవర్లో సాక్ష్యాధారాలు పంపాలని ఏపీ డీజీపీ తనకు లేఖ రాయడం హాస్యాస్పదమని తెదేపా అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. "సాక్ష్యాధారాలు ఇస్తే వాళ్లు దర్యాప్తు చేస్తారట. ఇన్వెస్టిగేషన్ బాధ్యత పోలీసులదా, ప్రతిపక్షానిదా?" అని ప్రశ్నించారు. దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయా? అని చంద్రబాబు నిలదీశారు. కొందరు పోలీసుల ఉదాసీనత చూసి నేరగాళ్లు రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. ఏపీలో వైకాపా అరాచకాలు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయన్నారు.
రామచంద్రపై దాడికి రాజకీయాలతో సంబంధం లేదని ఎస్పీ, డీఎస్పీ మొదట చెప్పారని సాయంత్రానికల్లా కుమార్ రెడ్డి పేరుకు బదులు ప్రతాప్ రెడ్డి పేరు తెచ్చారని చంద్రబాబు ఆరోపించారు. వ్యవస్థలను ఏవిధంగా మేనేజ్ చేస్తున్నారో ఇదే ప్రత్యక్ష సాక్ష్యమన్నారు. వైకాపా నాయకులపై, సీఎం జగన్ బంధువులపై కేసులు ఎత్తేస్తున్నారని, ఏ నేరం చేయక పోయినా తెదేపా నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు.