Chandrababu comments on Jagan: జగన్ చేసిన తప్పులను చరిత్ర మరచిపోదని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఏపీ మళ్లీ కోలుకోలేని విధంగా దెబ్బతీశారని విమర్శించారు. రాష్ట్ర విభజన కంటే జగన్ పాలనలోనే ఏపీ తీవ్రంగా దెబ్బతిందని దుయ్యబట్టారు. ఏపీ బాగుపడాలంటే వైకాపా అనే గ్రహణం వీడాలన్నారు. రాష్ట్రాభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని అన్నారు. గంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ శ్రేణులతో.. రెండో రోజు చంద్రబాబు సమావేశమయ్యారు. అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల బాధ్యులతో భేటీ అయ్యారు. 2024 ఎన్నికలే లక్ష్యంగా చంద్రబాబు కార్యాచరణ రూపొందించనున్నారు.
ఆందోళనలు చేస్తాం..
ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై నిరసనలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. మహానాడు వరకు వరుస కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈనెల 8న రైతు సమస్యలు, 11న నిత్యావసరాల ధరల పెరుగుదలపై ఆందోళనలు చేయనున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఈనెల 18 నుంచి తెదేపా సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టనున్నట్లు వెల్లడించారు.
'జగన్ పాలనలో ఏమాత్రం అభివృద్ధి లేదు. నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగాయి. సంతోషంగా సంక్రాంతి పండగ నిర్వహించుకోలేని పరిస్థితి. పన్నులపై పన్నులు వేసి ప్రజలపై భారం మోపుతున్నారు. ఆఖరికి చెత్తపైనా పన్ను వేసే పరిస్థితికి వచ్చారు. ప్రభుత్వం అంటే ప్రతిపక్షంపై కేసులు పెట్టడమా? జగన్ చేసిన తప్పులకు వైకాపా ఎలాగూ పోయింది. జగన్ తప్పులకు రాష్ట్రం కూడా నష్టపోయింది. ఐఏఎస్, ఐపీఎస్ వ్యవస్థలను భ్రష్టు పట్టించేశారు. న్యాయ వ్యవస్థపైనా విమర్శలు చేశారు. ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు. రాష్ట్రాన్ని జగన్ మాదిరిగా దెబ్బతీసిన సీఎం లేరు.'
- చంద్రబాబు, తెదేపా అధినేత