తెలంగాణ

telangana

ETV Bharat / city

ఆ రెండు బిల్లులు చట్టవిరుద్ధం: గవర్నర్​కు లేఖలో చంద్రబాబు

పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ చట్టం రద్దు బిల్లులు 2014 ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టానికి వ్యతిరేకమని తెదేపా అధినేత చంద్రబాబు పునరుద్ఘాటించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ను కాపాడాలని కోరుతూ ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌కు ఆరు పేజీల లేఖ రాశారు. రాజకీయ కక్షల ముసుగులోనే వైకాపా ప్రభుత్వం రెండు బిల్లుల్ని తీసుకువచ్చిందని లేఖలో మండిపడ్డారు.

chandra-babu-letter-to-governor-biswa-bhusan-harichandan
'ఆ బిల్లులు చట్ట వ్యతిరేకం'.. గవర్నర్​కు చంద్రబాబు లేఖ

By

Published : Jul 19, 2020, 1:41 PM IST

'ఆ బిల్లులు చట్ట వ్యతిరేకం'.. గవర్నర్​కు చంద్రబాబు లేఖ

వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానులు ప్రతిపాదిస్తూ బిల్లు తీసుకొచ్చింది. అయితే, శాసనమండలి ఆ బిల్లుని సెలెక్ట్‌ కమిటీకి పంపింది. ప్రస్తుతం ఆ బిల్లుల్ని గవర్నర్‌ ఆమోదం కోసం ఏపీ ప్రభుత్వం పంపడంతో తెదేపా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ అంశాలన్నింటినీ ప్రస్తావిస్తూ గవర్నర్‌కు చంద్రబాబు లేఖ రాశారు. ప్రస్తుత ఏపీ రాజధాని అమరావతి శిథిలాల మీద మూడు కొత్త రాజధాని నగరాలను నెలకొల్పడానికే రెండు బిల్లులు తెచ్చారని ధ్వజమెత్తారు. అమరావతి అంశం హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నప్పుడు శాసనసభ నిబంధనల ప్రకారం ఈ బిల్లుల్ని చర్చించడం.. ఆమోదించడం.. కోర్టు ఉల్లంఘన కిందకు వస్తుందని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమక్షంలో ప్రధాని మోదీ రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేశారని చంద్రబాబు గుర్తుచేశారు. దిల్లీ కంటే మెరుగైన నగరంగా నిర్మిస్తామని శంకుస్థాపన కార్యక్రమంలో మోదీ హామీ ఇచ్చిన అంశాన్ని లేఖలో ప్రస్తావించారు.

కేంద్ర ప్రభుత్వం అమరావతిని స్మార్ట్‌ సిటీగా గుర్తించిందన్నారు. ప్రస్తుత సెక్రటేరియట్‌, శాసనసభ, మండలి, హైకోర్టు ఇతర మౌలిక సదుపాయాల నిర్మాణానికి రూ.2500 కోట్లు సమకూర్చిందని తెలిపారు.

అలాగే, స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టు కింద రూ.700 కోట్ల అదనపు నిధుల్ని ఇచ్చిందని గుర్తుచేశారు. హైకోర్టు ఏర్పాటుకు అనువైన ప్రదేశంగా సుప్రీంకోర్టు అమరావతిని నోటిఫై చేసిందని చంద్రబాబు లేఖలో తెలిపారు.

అమరావతిని ఏపీ రాజధానిగా చేర్చి సర్వే ఇండియా మ్యాప్‌ను సరిదిద్దారని చంద్రబాబు గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వ మౌలిక సదుపాయాల కల్పనకు సుమారు రూ.10 వేల కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. అమరావతిని సెల్ఫ్‌ ఫైనాన్స్‌ ప్రాజెక్టుగా సమకూర్చడం వల్ల ఇప్పటి నుంచి డబ్బు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదన్నారు.

ఈ నగరమే స్వీయ ఆర్థిక సాయం అందించడంతో పాటుగా.. రాష్ట్ర ఖజానాకు ఆదాయాన్ని కూడా సమకూరుస్తుందన్నారు. అందుకే రాజధాని నగరాన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయి నగరాలకు దీటుగా డిజైన్‌ చేశారన్నారు.

వైకాపా ప్రభుత్వం రాజధాని నగరం అమరావతి ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోందని చంద్రబాబు విమర్శించారు. ఏపీ శాసనమండలి ఈ బిల్లుల్ని తిరస్కరించలేదని.. రెండు బిల్లుల్ని కౌన్సిల్‌ సెలెక్ట్‌ కమిటీకి సూచించిన విషయాన్ని లేఖ ద్వారా గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లారు.

బిల్లుల్ని కౌన్సిల్‌లో రెండోసారి ప్రవేశపెట్టినప్పుడు సెలెక్ట్‌ కమిటీ వద్ద పెండింగ్‌లో ఉన్నందున శాసన మండలి రెండోసారి పరిగణించలేదని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details