chandra babu kuppam tour: ఆంధ్రప్రదేశ్‌లో దళితులపై దాడులు చూస్తుంటే ఆందోళన కలుగుతోందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఎస్సీలను చంపేసుకుంటూ పోతే అడిగేవారు లేరనుకున్నారా? అని ప్రశ్నించారు. కుప్పం నియోజకవర్గంలో మూడో రోజు పర్యటిస్తున్న చంద్రబాబు.. ఇవాళ కుప్పంలో నిర్వహించిన రోడ్‌షోలో మాట్లాడారు.
పోలీసులు విఫలం
‘‘వేధింపులు భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఒక ఎస్సీ మాస్కు పెట్టుకోలేదని కొట్టి చంపారు. ముఖ్యమంత్రి మాత్రం మాస్కు పెట్టుకోరు. ఎస్సీ, ఎస్టీలను అవమానిస్తే చూస్తూ ఊరుకోము. వారి మనోభావాలు దెబ్బతీస్తే సహించేది లేదు. రాజ్యాంగ హక్కులు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్సీలకు అండగా ఉండాల్సిన పోలీసులు విఫలమయ్యారు. ఎస్సీలపై దాడి చేసిన వారిపై చర్యల్లేవు.’’ - చంద్రబాబు
వైకాపా చేసిందేమీ లేదు
వైకాపా ప్రభుత్వం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి పట్టించుకోవట్లేదని చంద్రబాబు ఆరోపించారు. తెదేపా చేసిన అభివృద్ధి తప్ప వైకాపా ప్రభుత్వంలో చేసిందేమీ లేదని విమర్శించారు. తెదేపా హయాంలోనే కుప్పం నియోజకవర్గం అభివృద్ధి చెందిందన్నారు. నిత్యావసరాల ధరలు పెరిగి, పండగలు కూడా చేసుకోలేని పరిస్థితి ఏర్పడిందని విచారం వ్యక్తం చేశారు.
'ఓటీఎస్ ఎవరూ కట్టొద్దు... పేదలకు అండగా నేను ఉన్నా. ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చిన ఘనత తెదేపాది. ఇవ్వడానికి డబ్బుల్లేక 60 నుంచి 62 ఏళ్లకు పదవీ విరమణ వయస్సు పెంచారు. జగన్ ప్రకటించింది రివర్స్ పీఆర్సీ. - చంద్రబాబు, తెదేపా అధినేత
భద్రతా లోపాలపై అసంతృప్తి
అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటన సందర్భంగా తలెత్తిన భద్రతా లోపాలపై.. చంద్రబాబు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని భద్రత అంశం దేశానికి సంబంధించి ఎంతో ప్రాధాన్యమైందని చెప్పారు. ప్రధాని పర్యటనలో భద్రతా లోపాలు తలెత్తడం ఆందోళన కలిగిస్తోందని చంద్రబాబు ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి:BJP Laxman Comments On GO 317: జీవో 317పై పోరాటం ఆగదు: లక్ష్మణ్