వైకాపా పాలనలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైందని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. సీఎం జగన్ పరిపాలనలో అనుభవలేమి స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని విచారం వ్యక్తం చేశారు. తిరుపతి లోక్ సభ నియోజకవర్గ ఉప ఎన్నిక నేపథ్యంలో.. ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగులకు 6 డీఏలు పెండింగ్ పెట్టారని.. పీఆర్‌సీకి ఇంకా అతీగతీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పులు చేయడంలో రాష్ట్రం నెంబర్‌వన్‌గా ఉందని.. రాష్ట్రంలో మానవహక్కుల ఉల్లంఘన ఎక్కువగా ఉందని విమర్శించారు. అక్రమ కేసులు, అమాయకులను హత్య చేయడం ఎక్కువైందన్నారు.
ప్రభుత్వ పాలన తీరుపై తిరుపతి ప్రజల్లో ఎంతో ఆవేదన ఉందని.. లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో విస్తృతంగా పర్యటించిన తనకు ఈ విషయం అర్థమైందని చంద్రబాబు చెప్పారు. తిరుపతి పవిత్రత దారుణంగా దెబ్బతీస్తున్నారని ఆయన ఆగ్రహించారు. ఎర్రచందనాన్ని చైనా వరకు అక్రమ రవాణా చేస్తున్నారని.. తిరుపతిలో ఉన్న ప్రభుత్వ భూములు కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. తితిదే ఆస్తులు అమ్మేందుకు అనేక రకాలుగా ప్రయత్నించారని విమర్శించారు. రాష్ట్రంలో మద్యం, ఇసుక దోపిడీ బాగా ఎక్కువైందని చంద్రబాబు అన్నారు. దేవాలయాలపై దాడుల్లో రాష్ట్రం నెంబర్‌వన్‌గా మారిందని.. చెప్పారు. ఇన్ని అక్రమాలు జరుగుతున్నా సీఎం ఏమీ పట్టించుకోవడం లేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా నేతల వేధింపులు తట్టుకోలేక అనేకమంది వలసలు వెళ్తున్నారని అన్నారు.