వైకాపా ప్రలోభాలకు లొంగలేదు కాబట్టే తెదేపా నేతలపై పగ సాధిస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. వైకాపా కండువా వేసుకుంటే వందల కోట్ల జరిమానాలు రద్దు చేస్తున్నారని... లొంగకపోతే అక్రమ కేసులు, అరెస్టులు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఏపీలోని అమరావతి నుంచి పార్టీ నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు....వైకాపా దుర్మార్గాలకు అంతు లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. ప్రజాదరణ ఉన్న రాజకీయ కుటుంబాలపై జగన్ కక్ష కట్టారని విమర్శించారు. వైకాపా దుశ్చర్య వల్లే అచ్చెన్నకు మళ్లీ శస్త్రచికిత్స చేసే పరిస్థితి వచ్చిందని దుయ్యబట్టారు. అచ్చెన్న ఘటనపై మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు.
- మీ మంత్రిని అరెస్టు చేస్తారా?
'కోర్టు తీర్పులతో జగన్ అసహనం రెట్టింపు అయ్యింది. తాను జైలుకు వెళ్లాను కాబట్టి అందరూ జైళ్లకు వెళ్లాలనేదే జగన్ అక్కసు. విచారణ జరుగుతున్న టెలి మెడిసిన్ కాంట్రాక్టర్‌కు జగన్ ప్రభుత్వం 3 కోట్ల రూపాయలు ఏవిధంగా చెల్లించింది. దీనిపై వైకాపా మంత్రిని అరెస్ట్ చేస్తారా? పరిపాలన అంటే ప్రతీకారం తీర్చుకోవడమా? అధికారం అంటే అక్రమ కేసులు పెట్టడమా? ఇలాంటి కక్ష సాధింపు పాలన దేశంలో ఎక్కడా లేదు' అని చంద్రబాబు ధ్వజమెత్తారు. - రాగద్వేషాలకు అతీత పాలనంటే ఇదేనా?
'ప్రభుత్వ పనులకు సీఎం జగన్ కంపెనీ సిమెంట్ కొనాలా? సొంత కంపెనీ సరస్వతీ పవర్‌కు 50ఏళ్లకు గనుల లీజులు ఇచ్చారు. సొంత మీడియాకే ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వాలి. ప్రభుత్వ సలహాదారులు, ఉద్యోగులుగా నీ సొంత మీడియా సిబ్బందిని నియమించుకుంటావు. ఇంతకన్నా అధికార దుర్వినియోగం ఎక్కడైనా ఉందా? ఇదేనా రాగద్వేషాలకు అతీతంగా పనిచేయడం? నేరగాళ్లకు భయపడే పార్టీ కాదు తెలుగుదేశం' అని చంద్రబాబు పేర్కొన్నారు.