వరదల కారణంగా చోటు చేసుకున్న మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని తెదేపా అధినేత చంద్రబాబు ఘాటు విమర్శలు చేశారు. ముంపు ప్రాంతాలకు వెళితే సహాయక కార్యక్రమాలకు ఆటంకమని సీఎం జగన్ వ్యాఖ్యానించడం.. చేతగానితనానికి నిదర్శనమని మండిపడ్డారు.
పార్టీ ముఖ్యనేతలతో సమావేశమైన చంద్రబాబు.. విపత్తు నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఈ వైఫల్యాలపై న్యాయవిచారణ జరగాలని డిమాండ్ చేశారు. బాధితులకు ఇంత వరకు పరిహారం అందలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన బాబు.. విపత్తు నిధులు రూ.1,100 కోట్లను దారిమళ్లించారని ఆరోపించారు.
వరి వేయవద్దంటూ రైతులను సాగుకు దూరం చేస్తున్నారని చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. బీమా కట్టకపోవడంతో రైతులకు పరిహారం అందని పరిస్థితి నెలకొందన్నారు. ఓటీఎస్ పేరుతో రూ.14,261 కోట్ల వసూళ్లు విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కేటాయించిన ఇళ్లకు రూపాయి కట్టనక్కర్లేదన్న చంద్రబాబు.. తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.