ఏపీలో రాజధానిని మారుస్తామని ఎన్నికలకు ముందుకు చెప్పకుండా ప్రజలను వైకాపా నేతలు మోసం చేశారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విమర్శించారు. అధికారంలోకి వచ్చాక 3 రాజధానులు చేస్తామనడం సరికాదన్నారు. 3 రాజధానులు.. సరైన నిర్ణయమని భావిస్తే అసెంబ్లీ రద్దుచేసి ప్రజల వద్దకు వెళ్దామని చంద్రబాబు సవాల్ విసిరారు.
48 గంటల సమయం ఇస్తున్నా.. అసెంబ్లీని రద్దు చేయండి: చంద్రబాబు - chandra babu challenge news
ఏపీ రాజధాని వ్యవహారాన్ని ప్రజల్లో తేల్చుకుందామని వైకాపా నేతలకు చంద్రబాబు సవాల్ విసిరారు. 48 గంటల్లో అసెంబ్లీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈలోపు స్పందించకపోతే మళ్లీ మీడియా ముందుకొస్తానన్నారు. రాజీనామాలు చేయడానికి తెలుగుదేశం ఎమ్మెల్యేలు సిద్ధమని చంద్రబాబు స్పష్టం చేశారు.
ఏపీ రాజధాని సమస్య ఏ ఒక్కరిదో కాదు. 5 కోట్ల ప్రజలది. రాజధానిని మారుస్తామని ఎన్నికల ముందు చెప్పనందున ఏపీ అసెంబ్లీని రద్దు చేయండి. ప్రజలకు చెప్పకుండా చేయడం నమ్మకద్రోహమే. మీకు 48 గంటల సమయం ఇస్తున్నా అసెంబ్లీని రద్దుచేయండి. రాజీనామాలు చేసి ప్రజల ముందుకెళ్దాం. రాజీనామాలు చేయడానికి తెలుగుదేశం ఎమ్మెల్యేలు సిద్ధం. మీరు రాజీనామాలు చేసి రండి ప్రజల్లో తేల్చుకుందాం. నా సవాల్‌ను స్వీకరిస్తారా.. ప్రజలకు వెన్నుపోటు పొడుస్తారా? రెండింటిలో ఏదో ఒకటి తేల్చుకోండి. 48 గంటల్లో మీరు స్పందించకపోతే.. బుధవారం సాయంత్రం 5 గంటలకు మళ్లీ మీడియా ముందుకు వస్తా. ధైర్యం ఉంటే తేల్చుకోండి. ప్రజల తీర్పు మూడు రాజధానులకు అనుకూలంగా ఉంటే... నేను శిరసు వంచుతా- చంద్రబాబు, తెదేపా అధినేత
ఇవీచూడండి:'అమరావతి కోసం వైకాపా, తెదేపా ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి'