విజయవాడను గ్రేటర్ నగరంగా మార్చాలన్న ప్రతిపాదన 15 ఏళ్లుగా నానుతోంది. అన్ని అర్హతలు, అవకాశాలున్నా విజయవాడకు గ్రేటర్ మోక్షం కలగడం లేదు. బెజవాడ ప్రజల ఆకాంక్ష తీరడంలేదు. అన్ని రంగాల్లో దేశంలోని ఇతర మహానగరాలతో విజయవాడ పోటీపడుతున్నా... గ్రేటర్ నగరంగా ఎందుకు మార్చడంలేదనే చర్చ జరుగుతోంది..!
విజయవాడ నగరంలో అంతర్భాగంగా, చుట్టుపక్కలున్న పంచాయతీలను కలిపి 'గ్రేటర్ విజయవాడ'గా మార్చాలన్న ప్రతిపాదన ఎప్పటినుంచో ఉంది. విజయవాడలో, చుట్టుపక్కలున్న 14 గ్రామాల్ని విజయవాడ నగరపాలక సంస్థ (వీఎంసీ) పరిధిలోకి తేవాలని 2005లోనే తీర్మానం చేశారు. తర్వాత ఆ సంఖ్య 30కి, 45కి, 51కి పెరిగింది కానీ... ఒక్క గ్రామాన్నీ విలీనం చేయలేదు.
ప్రభుత్వం ‘గ్రేటర్ ప్రతిపాదనను పూర్తిగా పక్కకు నెట్టేసిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇబ్రహీంపట్నం, కొండపల్లి తదితర ప్రాంతాల్ని నగరంలో కలపాలన్న ప్రతిపాదన ఉన్నప్పటికీ ఏడాది కిందట ఇబ్రహీంపట్నాన్ని ప్రత్యేక మున్సిపాలిటీ చేసింది. విజయవాడలో భాగమైన యనమలకుదురు, తాడిగడప, పోరంకి, కానూరుల్ని కలిపి ప్రత్యేక మున్సిపాలిటీగా చేస్తూ ఆర్డినెన్స్ ఇచ్చింది. నగరాన్ని ఇలా ముక్కలు చేస్తూ.. ఎక్కడికక్కడ చిన్నచిన్న మున్సిపాలిటీలు చేసుకుంటూ పోతూ... ‘గ్రేటర్’ఆశల్ని సమాధి చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
అర్హతలు ఉన్నా...
రాష్ట్రానికి నడిబొడ్డున, కృష్ణా నది ఒడ్డున విజయవాడ నగరం ఉంది. తాగునీటికి కొరత లేదు. పెద్ద రైల్వే జంక్షన్, అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నాయి. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, విశాఖ వంటి నగరాలకు మధ్యలో ఉంది. రాజకీయ, సాంస్కృతిక కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. నగరంలోనూ, చుట్టుపక్కల విద్యా సంస్థలు, ఆస్పత్రులున్నాయి. ఇలా అన్ని అర్హతలూ ఉన్నా విజయవాడను ఎందుకు మహానగరం చేయడం లేదనే ప్రశ్న నగరవాసుల నుంచి ఉత్పన్నమవుతోంది.
కృష్ణా జిల్లాలోని విజయవాడ చుట్టుపక్కలున్న గ్రామాలతో పాటు, గుంటూరు జిల్లాలోని తాడేపల్లి, మంగళగిరి మున్సిపాలిటీల్ని విజయవాడలో విలీనం చేస్తే.. రాష్ట్రంలోనే పెద్ద నగరంగా, గ్రేటర్ సిటీగా ఎదిగేది. 15 ఏళ్ల కిందట జేన్‌ఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకానికి అర్హత సాధించేందుకు విజయవాడ జనాభా తక్కువగా ఉండటంతో... తాడేపల్లి, మంగళగిరిని కలిపి చూపించి పథకానికి అర్హత సాధించారు.