తెలుగు అకాడమీ ఎఫ్‌డీల గోల్‌మాల్ కేసులో సీసీఎస్ పోలీసుల విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు నలుగురుని ఆరెస్ట్ చేయగా... తాజాగా యూనియన్ బ్యాంకు మేనేజర్ మస్తాన్‌వలీ సహచరుడు రాజ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఎఫ్‌డీల ఉపసంహరణకు తెలుగు అకాడమీ ఏర్పాటు చేసిన బ్యాంకర్ల సమావేశానికి యూనియన్ బ్యాంక్ మేనేజర్ మస్తాన్‌వలీతో పాటు రాజ్‌కుమార్ కూడా వెళ్లాడు. ఎఫ్‌డీల ఉపసంహరణ వ్యవహారంలో మస్తాన్‌వలీతో కలిసి కీలకంగా వ్యవహరించాడు.
ప్రస్తుతం రాజ్‌కుమార్‌ను పోలీసులు విచారిస్తున్నారు. కేసులో రాజ్‌కుమార్ ఏ-2గా ఉన్నాడు. మరో వైపు మాజీ డైరెక్టర్ సోమిరెడ్డి, ఔట్ సోర్సింట్ ఉద్యోగి రఫి వాగ్మూలాలను పోలీసులు నమోదు చేశారు. యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంకు సిబ్బంది, కెనరా బ్యాంకు డీజీఎం... విచారణకు హాజరయ్యారు. చందానగర్‌లోని కెనరా బ్యాంకులో ఇతరుల ఎఫ్డీలు కూడా గల్లంతయ్యాయని పోలీసులు భావిస్తున్నారు. ఆ దిశగా సిబ్బందిని విచారించారు. ఫోర్జరీ సంతకాలకు సంబంధించి అకాడమీకి చెందిన కీలక వ్యక్తిని రేపు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే సీసీఎస్‌కు మర్చంటైల్ సహకార సంఘం ఛైర్మన్ సత్యనారాయణ రావు భార్య వచ్చారు. అతడి అరెస్ట్ గురించిన వివరాలు పోలీసులు ఆమెకు వివరించారు. ప్రస్తుతం.. సత్యనారాయణ చంచల్గూడా జైల్లో ఉన్నారు.
సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం...
తెలుగు అకాడమీలో డిపాజిట్ల గోల్‌మాల్ (Telugu academy scam)కేసులో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. తెలుగు అకాడమీ డైరెక్టర్ సోమిరెడ్డిపై వేటు వేసింది. అకాడమీ డైరెక్టర్ అదనపు బాధ్యతల నుంచి సోమిరెడ్డిని విద్యాశాఖ తప్పించింది. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ దేవసేనకు అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ గోల్మాల్ను నిగ్గు తేల్చేందుకు ముగ్గురు సభ్యులతో ఓ కమిటీ వేసింది. ఈ వ్యవహారంపై సాధ్యమైనంత త్వరగా నివేదిక అందజేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మరోపక్క నిధుల గోల్‌మాల్ వ్యవహారంలో(Fixed Deposits Scam In Telugu Academy) లెక్కలు తేల్చే పనిలో సీసీఎస్ నిమగ్నమైంది.
అసలు స్కాం ఏంటి..
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి జాబితాలో ఉన్న తెలుగు అకాడమీ (Telugu academy scam).. హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో దశాబ్దాలుగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఉమ్మడి జాబితాలో ఉన్న తెలుగు అకాడమీ నిధులను ఆంధ్రప్రదేశ్‌కు పంచాలంటూ కొద్దిరోజుల క్రితం సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈనెల 28 లోపు తెలుగు అకాడమీ సిబ్బంది, చరాస్తులను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు పంచుకోవాల్సి ఉంది. రాష్ట్ర విభజన నాటికి అకాడమీ వద్ద ఉన్న రూ.213 కోట్లను అధికారులు పలు బ్యాంకు శాఖల్లో డిపాజిట్ చేశారు. నిధులను ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు 58: 42 నిష్పత్తిలో పంచుకోవాలి. ఆ ప్రకారం ఏపీకి రూ.124 కోట్లు ఇవ్వాల్సి ఉంది.
ఇలా వెలుగులోకి వచ్చింది..
ఈ నేపథ్యంలో .. భవనాలు, నగదు వివరాలను లెక్కిస్తుండగా.. వివిధ బ్యాంక్‌లతోపాటు యూబీఐ కార్వాన్, సంతోష్‌నగర్ శాఖల్లో రూ.43 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లున్నాయని(fixed deposits) తేలింది. గడువు తీరకముందే వాటిని తీసుకోవాలని అకాడమీ అధికారులు నిర్ణయించారు. ఈనెల 21న డిపాజిట్ పత్రాలు బ్యాంకుకు చేరినా అటువైపు నుంచి సమాచారం లేకపోవడంతో మూడు రోజుల తర్వాత తెలుగు అకాడమీ ఉద్యోగి రఫీక్ నేరుగా బ్యాంకుకు వెళ్లారు. ఆగస్టులోనే రూ.43 కోట్లు విత్‌డ్రా అయ్యాయని బ్యాంకు అధికారులు తెలిపారు. నిగ్గు తేల్చాలని అకాడమీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సంబంధిత కథనం..