సరికొత్త ఆలోచనలు, భాగస్వామ్యంతో యువత, పట్టభద్రులు వ్యవసాయంలోకి రావాలని అఖిల భారత వ్యవసాయ మండలి పూర్వ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఆర్‌ఎస్ పరోడా కోరారు. హైదరాబాద్ రాజేంద్రనగర్ నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్మెంట్లో.. వర్చువల్ వేదికగా జరిగిన 111వ ఫౌండేషన్ కోర్స్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ సర్వీసెస్ -ఫోకార్స్ శిక్షణ ముగింపు సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
తెలంగాణ, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, కేరళ, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వంటి 17 రాష్ట్రాల నుంచి జాతీయ స్థాయిలో అగ్రికల్చర్ రీసెర్చ్ సర్వీస్-ఏఆర్‌ఎస్‌లో యువ శాస్త్రవేత్తలు ఉత్తీర్ణులయ్యారు. వివిధ రాష్ట్రాల్లో శాస్త్రవేత్తలుగా నియమితులైన తర్వాత నార్మ్‌లో ఫోకార్సు శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న 37 మందికి ఆయన సర్టిఫికేట్లు ప్రధానం చేశారు. 1994లో విజన్-2020 లక్ష్యాలతో మొదలై భారత వ్యవసాయ రంగంలో విద్యా బోధన, పరిశోధన, విస్తరణ, అభివృద్ధి వంటి అంశాల్లో పురోగతి సాధించిన క్రమంలో.. ఇక నుంచి విజన్-2030 లక్ష్యాలతో మరింత ముందుకెెళ్లాలని పరోడా తెలిపారు.