తెలంగాణ

telangana

ETV Bharat / city

KRMB and GRMB Gazette : నేటి నుంచే 'కృష్ణా, గోదావరి' గెజిట్‌ అమలు.. ఉత్తర్వులపై ఉత్కంఠ! - నేటి నుంచి అమల్లోకి కేంద్రం గెజిట్

కృష్ణా, గోదావరి నదులపై గుర్తించిన ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రం జారీ చేసిన గెజిట్(KRMB and GRMB Gazette Implementation) నోటిఫికేషన్ నేటి నుంచి అమల్లోకి రానుంది. ఈ విషయంపై ఇప్పటికే రెండు బోర్డులు ఇరు రాష్ట్రాల అధికారులతో పలుమార్లు సమావేశమయ్యాయి. మొత్తం 15 అవుట్​లెట్లకు సంబంధించి ఇరు ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. కేఆర్​ఎంబీ ప్రకటించిన 15 అవుట్​లెట్లలో శ్రీశైలం పరిధిలో 6.. సాగర్​ కింద 9 అవుట్​లెట్లు ఉన్నాయి. విద్యుత్ కేంద్రాలు మినహాయించి ఉత్తర్వులిచ్చేందుకు తెలంగాణ యత్నిస్తుండగా.. ఉత్తర్వుల జారీపై ఏపీ సర్కార్ కసరత్తు చేస్తోంది.

KRMB and GRMB Gazette Implementation
KRMB and GRMB Gazette Implementation

By

Published : Oct 14, 2021, 9:11 AM IST

కృష్ణా, గోదావరి నదులపై గుర్తించిన ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించి నేటి నుంచి గెజిట్‌(KRMB and GRMB Gazette Implementation) అమలు కానుంది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్‌(KRMB and GRMB Gazette Implementation) ప్రకారం కృష్ణా, గోదావరి బోర్డులు ఈ మేరకు ప్రక్రియను అమలు చేయనున్నాయి. గెజిట్‌లో పేర్కొన్న ప్రాజెక్టులన్నింటికీ బదులు రాష్ట్ర ప్రభుత్వాలు సమ్మతి తెలిపే ప్రాజెక్టుల బాధ్యతలను మొదటి దశలో స్వీకరించనున్నాయి. ఇప్పటికే సమావేశాల్లో ప్రతిపాదించి తీర్మానించిన జాబితాను రెండు రాష్ట్రాలకు అందజేశాయి. మరికొన్ని వివరాలను పంపించాల్సి ఉన్నట్లు సమాచారం. మొత్తం 15 అవుట్‌లెట్లకు సంబంధించి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీచేయాల్సి ఉంది.

ఉత్తర్వులపై ఉత్కంఠ

బోర్డులు ఖరారు చేసిన ప్రాజెక్టులకు సంబంధించి అన్ని వివరాలను రాష్ట్రాలు అప్పగించాల్సి ఉంది. ఈ మేరకు రాష్ట్రాలు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయనున్నాయి. 11, 12 తేదీల్లో జరిగిన గోదావరి, కృష్ణా బోర్డుల సమావేశాల్లో చేసిన తీర్మానం ప్రకారం తెలంగాణ, ఏపీలు సమగ్ర వివరాలు బోర్డులకు అందజేస్తేనే పూర్తి స్థాయిలో గెజిట్‌ అమలు ప్రక్రియ సాధ్యమవుతుంది. తెలంగాణ జెన్‌కో పరిధిలోని మూడు జల విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలను బోర్డులకు ఇవ్వమని ఇప్పటికే స్పష్టం చేసింది. అవి మినహా మిగిలిన అవుట్‌లెట్లను అప్పగిస్తుందని తెలుస్తోంది. ఏపీ ఆరు అవుట్‌లెట్లను అప్పగించేందుకు సిద్ధమని ప్రకటించగా ఉత్తర్వులు విడుదల కావాల్సి ఉంది. ఒక రాష్ట్రం ఉత్తర్వులు జారీ చేసి మరో రాష్ట్రం జారీ చేయకపోతే గెజిట్‌ పాక్షికంగానే అమలయ్యే అవకాశాలు ఉన్నాయి. ముందుగా రాష్ట్ర ప్రభుత్వాలు అప్పగించే అవుట్‌లెట్లను తీసుకుని నెమ్మదిగా అడుగులేయాలని కేంద్రం ఇప్పటికే బోర్డులకు సూచించింది. దీనిలో భాగంగానే రెండు నదులపై ఉన్న అన్ని ప్రాజెక్టులు కాకుండా శ్రీశైలం కింద ఏడు, సాగర్‌ కింద ఎనిమిది అవుట్‌లెట్లను కృష్ణా బోర్డు ప్రతిపాదనల్లో చేర్చింది. గోదావరి బోర్డు మధ్యతరహా ప్రాజెక్టు పెద్దవాగును ఎంపిక చేసింది.

దశలవారీగా నిర్వహణ బాధ్యతలు

రెండు రాష్ట్రాల నీటి వాటాలను సక్రమంగా అమలు చేసే బాధ్యతలను బోర్డులు భుజాలకెత్తుకోనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే వినతుల మేరకు బోర్డుల పరిధిలో ఉన్న ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలను కొనసాగిస్తాయి. దీనికోసం రెండు రాష్ట్రాల పరిధిలోని సిబ్బంది బోర్డు అధికారాల మేరకు నడచుకోవాల్సి ఉంటుంది. గురువారం నుంచి గెజిట్‌ అమలు ప్రారంభమవుతున్నా సిబ్బందితోపాటు నిధులు, ఆస్తులు తదితరాలన్నీ రాష్ట్రాల నుంచి బదిలీ కాలేదు. దీంతో మూడు నెలల పాటు రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోనే అవి కొనసాగనున్నట్లు సమాచారం. ఈలోగా ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకుని ఒక్కో విభాగాన్ని తమ పరిధిలోకి తెచ్చుకోవడానికి బోర్డులు కార్యాచరణ రూపొందిస్తున్నాయి.

  • కృష్ణా బోర్డు ప్రతిపాదనల జాబితా

తెలంగాణ పరిధిలో తొమ్మిది అవుట్‌లెట్లు

శ్రీశైలం- ఎడమ గట్టు జల విద్యుత్‌ కేంద్రం (జెన్‌కో), కల్వకుర్తి పంపుహౌస్‌;

సాగర్‌- కుడి కాల్వ హెడ్‌రెగ్యులేటర్‌, ఎడమ కాల్వ హెడ్‌ రెగ్యులేటర్‌, వరద కాల్వ హెడ్‌ రెగ్యులేటర్‌, ఎలిమినేటి మాధవరెడ్డి పంపుహౌస్‌, ప్రాజెక్టు ప్రాజెక్టు (నది, స్లూయీస్‌, స్పిల్‌ వే)

జెన్‌కో పరిధిలోని ప్రధాన జల విద్యుత్‌ కేంద్రం, లాల్‌బహదూర్‌ కాల్వపై ఉన్న విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం.

ఏపీ పరిధిలో ఆరు అవుట్‌లెట్లు

శ్రీశైలం- ప్రాజెక్టు (నది, స్లూయీస్‌, స్పిల్‌ వే), పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌, ఎస్‌ఆర్‌ఎంసీ, హంద్రీనీవా ఎత్తిపోతల పథకం పంపుహౌస్‌, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం పంపుహౌస్‌, కుడి గట్టు విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం (జెన్‌కో), సాగర్‌- నాగార్జునసాగర్‌ కుడి కాల్వ విద్యుత్‌ కేంద్రం (జెన్‌కో)

  • గోదావరి బోర్డు ప్రతిపాదన

రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు: పెద్దవాగు (ఆనకట్ట- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం, ఆయకట్టు- పశ్చిమ గోదావరి జిల్లా కూనవరం, వేలేరుపాడు మండలాలు)

ABOUT THE AUTHOR

...view details