కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో మరోసారి కేంద్ర బృందాలు పర్యటించనున్నాయి. తాజాగా కేంద్రం ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ నేతృత్వంలోని కేంద్రం బృందం ఈ నెల 26 నుంచి 29 తేదీల్లో తెలంగాణ సహా... కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న గుజరాత్, మహారాష్ట్రలోనూ పర్యటించనుంది. కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్ర బృందం రాష్ట్రాలతో చర్చించనుంది.
దేశంలో కరోనా మహమ్మారి వెలుగులోకి వచ్చిన నాటి నుంచి.. రాష్ట్ర ప్రభుత్వాల అప్రమత్తతపై కేంద్రం ఎప్పటికప్పుడు ఆరా తీస్తోంది. అవసరమయితే తమ బృందాలను పంపి సమాచారాన్ని సేకరిస్తోంది. ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులను బట్టీ సూచనలు సలహాలు ఇస్తోంది.
నాలుగోసారి రాష్ట్రానికి..
కరోనా కేసులు నమోదయిన తొలినాళ్లలో మొదటిసారి రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర బృందం.. గాంధీ ఆస్పత్రిలో వార్డుల ఏర్పాటు, మైక్రోబయాలజీ లాబ్ నిర్వహణ, టెస్ట్ లీక్ ప్రక్రియ, ఐసోలేషన్ ఏర్పాట్లు పరిశీలించింది. అనంతరం అరుణ్ భరోక సారథ్యంలో ఏప్రిల్ 25 నుంచి మే 2 వరకు రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర బృందం.. కిందిస్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు పరిస్థితులను సమీక్షించింది. లాక్డౌన్ సడలింపుల అనంతరం బాధితులకు అందుతున్న వైద్యం, కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలపై మరో మారు పరిశీలించింది. ఐసీఎంఆర్ కమ్యూనిటీ వ్యాప్తి సిరం సర్వే కూడా నిర్వహించింది. ఆయా బృందాలు ఎప్పటికప్పుడు రాష్ట్రంలో పరిస్థితిని కేంద్రానికి నివేదించాయి. ఇప్పుడు కరోనా ఉద్ధృతి అధికమైన నేపథ్యంలో మరోసారి రాష్ట్ర పర్యటనకు రానుంది.
ప్రతిపక్షాల ఆరోపణల నేపథ్యంలో..
రాష్ట్ర ప్రభుత్వం తక్కువ కరోనా నిర్ధరణ పరీక్షలు చేస్తోందంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో కేంద్ర బృందం ఎటువంటి నివేదిక ఇస్తోంది వేచిచూడాలి.
ఇవీచూడండి:తెలంగాణలో మరో 920 కరోనా కేసులు, 5 మరణాలు