తెలంగాణ

telangana

ETV Bharat / city

ఆర్థిక సాయం అందేలా చూడాలి.. కేంద్ర బృందాన్ని కోరిన ఏపీ సీఎం - కేంద్ర బృందంతో సీఎం జగన్ భేటీ న్యూస్

వరదల వల్ల అపారంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్​కు​ ఆర్థికసాయం అందేలా చూడాలని ఏపీ సీఎం జగన్ కేంద్ర బృందాన్ని కోరారు. భారీ వర్షాలతో రైతన్నలు తీవ్రంగా నష్టపోయినందున మానవతా దృక్పథంతో వ్యవహరించి వీలైంత ఎక్కువ సాయం అందేలా చేయాలని కోరారు. దెబ్బతిన్న ధాన్యం, వేరుశనగ కూడా కొనుగోలు చేయాలని ..’కనీస నాణ్యత ప్రమాణాలు’ సడలించాలని లేకపోతే రాష్ట్రంలో రైతులు నష్టపోతారని తెలిపారు.

central-team-meet-cm-jagan-and-meeting-on-crop-damage-due-to-floods
ఆర్థిక సాయం అందేలా చూడాలి.. కేంద్ర బృందాన్ని కోరిన ఏపీ సీఎం

By

Published : Nov 11, 2020, 10:04 PM IST

గత నెలలో కురిసిన భారీ వర్షాలు, వరదలతో సంభవించిన నష్టాన్ని అంచనా వేసేందుకు ఆంధ్రప్రదేశ్​కు వచ్చిన కేంద్ర బృందం పర్యటన ముగిసింది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి సౌరవ్‌రాయ్‌ నేతృత్వంలో కేంద్ర బృందం రెండు రోజుల పాటు ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరుతో పాటు, అనంతపురం జిల్లాలో పర్యటించింది. క్షేత్రస్థాయిలో పంట నష్టం వివరాలను నమోదు చేసుకున్న బృంద సభ్యులు బుధవారం మధ్యాహ్నం సీఎం జగన్‌ తో సమావేశమయ్యారు. తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో జరిగిన భేటీలో మంత్రులు మేకతోటి సుచరిత, కురసాల కన్నబాబు, సీఎస్‌ నీలం సాహ్ని, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, విపత్తు నిర్వహణశాఖ ముఖ్య కార్యదర్శి ఉషారాణి, విపత్తు నిర్వహణ విభాగం స్పెషల్‌ కమిషనర్‌ కె.కన్నబాబు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

రూ.8084 కోట్లు నష్టం

గత నెలలో సంభవించిన భారీ వర్షాల వల్ల ఎక్కువగా వ్యవసాయ, ఉద్యాన పంటలకు నష్టం జరిగిందని, ఆ తర్వాత రోడ్లు ఎక్కువగా దెబ్బతిన్నాయని, ఇంకా చెరువులు, కాల్వలకు గండ్లు పడి భారీ నష్టం సంభవించిందని సీఎస్‌ నీలం సాహ్ని వివరించారు. భారీ వర్షాలు, వరదల వల్ల రాష్ట్రంలో అపార నష్టం జరిగిందని, మొత్తం రూ.8084 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఏపీ సీఎం జగన్ కేంద్ర బృందానికి నివేదించారు. వీటిలో రూ.5 వేల కోట్ల మేర మౌలిక సదుపాయాలకు నష్టం కలగగా.. వ్యవసాయం, అనుబంధ ప్రైమరీ రంగంలో రూ.3 వేల కోట్ల మేర నష్టం జరిగిందని తెలిపారు.

నాణ్యత ప్రమాణాలు సడలించాలి

భారీ నష్టం జరిగినందు వల్ల మానవతా దృక్పథంతో వీలైనంత ఎక్కువ సహాయం అందేలా సహకరించాలని , రైతులను ఆదుకోవడంలో సహాయపడాలని కేంద్ర బృందాన్ని సీఎం కోరారు. వర్షాలు, వరదలతో దెబ్బ తిన్న పంటలు కూడా కొనుగోలు చేయాలని కోరారు. ధాన్యం, వేరుశనగ కొనుగోలులో ’కనీస నాణ్యత ప్రమాణాలు’ సడలించాలని, లేకపోతే రైతులు తీవ్రంగా నష్టపోతారని తెలిపారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఏ సీజన్‌లో జరిగిన పంట నష్టానికి అదే సీజన్‌లో పరిహారం ఇస్తున్నామని సీఎం తెలిపారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో జరిగిన నష్టానికి సంబంధించి మే నెల నుంచి సెప్టెంబరు వరకు ఇప్పటికే పరిహారం ఇచ్చామని స్పష్టం చేశారు.

వీలైనంత సహకారం

అక్టోబరులో జరిగిన నష్టంపై అంచనాలు తయారవుతున్నాయని ఆ పరిహారం కూడా ఇవ్వాల్సి ఉంది కాబట్టి, వీలైనంత త్వరగా సహాయం చేయాలని కేంద్ర బృందాన్ని సీఎం కోరారు. రాష్ట్రానికి కేంద్ర బృందాన్ని పంపినందుకు ప్రధాని, హోం మంత్రికి సీఎం జగన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు బృందం అనంతపురం జిల్లాలో కూడా పర్యటించినందుకు బృందానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో పర్యటన కాస్త ఆలస్యం అయినప్పటికీ భారీ వర్షాలు, వరదల వల్ల రైతులకు కలిగిన నష్టాన్ని అంచనా వేశామని బృందానికి నేతృత్వం వహిస్తున్న సౌరవ్‌రాయ్‌ వెల్లడించారు. తమ పర్యటనలో జిల్లాల అధికారులు సహకరించారని, నష్టంపై సమగ్ర సమాచారం అందించారని ఆయన తెలిపారు. రైతులకు జరిగిన నష్టంపై కేంద్రానికి పూర్తి నివేదిక ఇస్తామని, వీలైనంత సహకారం అందేలా చూస్తామని చెప్పారు.

ఇవీ చూడండి: విదేశీ టపాకాయల అమ్మడం చట్ట వ్యతిరేకం: లోకేష్ కుమార్

ABOUT THE AUTHOR

...view details